తాను క్లాస్‌తో పాటు మాస్ సీఎం న‌ని చెబుతున్నారా ?

ఇక, ఇప్పుడు కూడా శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. స్వ‌యంగా పేద‌ల ఇంట్లో టీ కాచి.. వ‌డ‌గ‌ట్టి తానే సర్వ్ చేశారు.

Update: 2024-11-03 11:30 GMT

విజ‌న్ ఉన్న ముఖ్య‌మంత్రిగా, రాష్ట్రానికి సీఈవోగా సీఎం చంద్ర‌బాబు పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇది క్లాస్ జ‌నాల ద‌గ్గ‌ర బాగానే వ‌ర్క‌వుట్ అయింది కానీ, క్షేత్ర‌స్థాయిలో పేద‌ల‌కు క‌నెక్ట్ కాలేదు. దీనివ‌ల్లే వైసీపీ ఓటు బ్యాంకు ప‌దిలంగా ఉంద‌న్న‌ది ఒక చ‌ర్చ‌. లేక‌పోతే.. ఇంత బ‌ల‌మైన పోటీలో కూడా వైసీపీ 37 శాతం పైగా ఓటు బ్యాంకు ఎలా సంపాయించుకుంద‌న్న‌ది ప్ర‌ధాన చ‌ర్చ‌. ఇదే ధైర్యం జ‌గ‌న్‌లోనూ క‌నిపి స్తోంది. పేద‌ల‌కుచంద్ర‌బాబు క‌నెక్ట్ కాలేర‌న్న‌ది ఆయ‌న భావ‌న‌.

ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ త‌ర‌చుగా పేద‌ల గురించి, ప‌థ‌కాల గురించే మాట్లాడుతూ.. వారిని తాను మ‌రింత ఓన్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ విష‌యాన్ని గ్ర‌హించారో ఏమో.. చంద్ర‌బాబు ఇప్పుడు వ్యూహా త్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. తాను క్లాస్‌తో పాటు మాస్ సీఎంన‌ని చెప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పేద‌ల ఇళ్ల‌కు వెళ్తున్నారు. వారితో క‌లిసి వారి మంచాల‌పైనే కూర్చుంటున్నారు. వారితో క‌లిసి టీ తాగుతున్నారు. వారి యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు.

గ‌త మూడు మాసాలుగా 1వ తేదీనాడు చంద్ర‌బాబు చేస్తున్న ప‌నులు ప‌రిశీలిస్తే.. ఇదే క‌నిపిస్తుంది. జూలై 1న అమ‌రావ‌తిలోని అత్యంత పేద‌ల ఇంటికి వెళ్లారు. పింఛ‌న్లు అందించారు. వారితో క‌లిసి టీ తాగారు. ఆగ‌స్టు 1న క‌ర్నూలు జిల్లాకు వెళ్లారు. అక్క‌డ కూడా సేమ్ టు సేమ్ ప‌నే చేశారు. సెప్టెంబ‌రులో ప్ర‌యాణా నికి వ‌ర‌ద‌లు అడ్డు వ‌చ్చాయి. దీంతో ఆగిపోయారు. అక్టోబ‌రులో మ‌ళ్లీ సేమ్ టు సేమ్ అన్న‌ట్టుగా పింఛ‌న్ల పంపిణీకి శ్రీకాకుళం వెళ్లారు. పేద‌ల ఇంటికి వెళ్లి వారితో క‌లిసి టీ తాగారు.

ఇక, ఇప్పుడు కూడా శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. స్వ‌యంగా పేద‌ల ఇంట్లో టీ కాచి.. వ‌డ‌గ‌ట్టి తానే సర్వ్ చేశారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. మాస్ లీడ‌ర్‌గా చంద్ర‌బాబు త‌న‌ను తాను ప్రొజెక్టు చేసుకునే ప్ర‌య‌త్నం, వైసీపీకి మాత్ర‌మే ప‌రిమితం అనుకున్న పేద‌ల ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. గ‌తంలో జ‌గ‌న్ ఇలా చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. తాను పెట్టుకున్న స‌భ వ‌ద్దే వారిని పిలిచి మాట్లాడేవారు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబు నేరుగా పేద‌ల ఇంటికే వెళ్లిపోతున్నారు. ఇదీ.. ఇద్ద‌రికీ తేడా. మ‌రి ఈ ప్ర‌య‌త్నం ఏమేర‌కు ఫలిస్తుందో చూడాలి.

Tags:    

Similar News