సూప‌ర్ సిక్స్ ఎఫెక్ట్‌: ఇస్తే ఒక బాధ‌, ఇవ్వ‌కుంటో మ‌రో బాధ‌.. !

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కొత్త ప్ర‌భుత్వం మూడు మాసాలు కూడా కాలేద‌ని స‌రిపెట్టుకున్న ప్ర‌జ‌లు ఇప్పుడు నోరు విప్పుతున్నారు.

Update: 2024-10-07 03:47 GMT

'సూప‌ర్ సిక్స్' ప‌థ‌కాల‌ను ఖ‌చ్చితంగా అమ‌లు చేసి తీరుతాం.. అంటూ రెండు రోజుల కింద సీఎం చంద్ర బాబు చెప్పుకొచ్చారు. అయితే.. ఈ విష‌యంపై తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. సూప‌ర్ సిక్స్‌లో ప్ర‌స్తుతం పెరిగిన పింఛ‌న్ల‌ను మాత్ర‌మే అమ‌లు చేస్తున్నారు. ఇత‌ర ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాల్సి ఉంది. వీటి కోసం.. ప్ర‌జ‌ల నుంచి కూడా డిమాండ్లు ప్రారంభ‌మ‌వుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కొత్త ప్ర‌భుత్వం మూడు మాసాలు కూడా కాలేద‌ని స‌రిపెట్టుకున్న ప్ర‌జ‌లు ఇప్పుడు నోరు విప్పుతున్నారు.

దీనికికార‌ణం.. స్కూళ్ల‌లో ఫీజులు క‌ట్టాల్సి రావ‌డం, పండుగ‌లు రావ‌డం, నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరిగిపోయిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం నుంచి అందే ప‌థ‌కాల‌పై వారి దృష్టి ఎక్కువ‌గా ఉంది. అంతేకాదు.. సూప‌ర్ సిక్స్ లో నూ కొత్త‌గా ప్ర‌క‌టించిన బ‌స్సు ప్ర‌యాణం, వంట గ్యాస్ వంటివాటిని ప్ర‌జ‌లు కోరుకుంటున్న ప‌రిస్థితి లేదు. మెజారిటీ ప్ర‌జ‌ల‌కు ల‌బ్ది చేకూర్చే త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేలకు, ఎంపీల‌కు కూడా ప్ర‌జ‌లు విన్న‌విస్తున్నారు.

అదేస‌మ‌యంలో ప్ర‌తి నెల రూ.1500 చొప్పున ఇచ్చే ఆడ‌బిడ్డ నిధి ప‌థ‌కాన్ని కూడా ప్ర‌జ‌లు కోరుకుంటు న్నారు. దీంతో చంద్ర‌బాబు ఎంత దాచుకుందామ‌ని అనుకున్నా.. దీని తాలూకు ఎఫెక్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి త‌గులుతూనే ఉంది. ఈ ప‌రిణామాల‌తో ఆయా ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాల‌ని చంద్ర‌బా బు చూస్తున్నారు. కానీ, ఇక్క‌డే ఆయ‌న‌కు మ‌రో చిక్కు వ‌చ్చింది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఉచిత హామీల‌కు అనుకూలంగా కూట‌మికి ఓటేసి గెలిపించ‌లేదు. కేవ‌లం అభివృద్ది మంత్రానికే వారు ప‌ట్టం క‌ట్టారు.

అలాంటి స‌మ‌యంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు క‌డుతున్న ప‌న్నులు, లేదా చేస్తున్న అప్పుల‌ను ఇప్పుడు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ఖ‌ర్చు చేస్తే.. అది మ‌ధ్య‌త‌ర‌గ‌తిలో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను పెంచేయ‌నుంది. ఇదే ఎఫెక్ట్ వైసీపీపై ప‌డిన విష‌యం తెలిసిందే. వైసీపీ పెద్ద ఎత్తున చేసిన సంక్షేమంపై మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఆందోళ న వ్య‌క్తం చేశారు. ఇప్పుడు తాను కూడా అదే ప‌నిచేస్తే.. ఇబ్బంది అని చంద్ర‌బాబు త‌ల‌పోస్తున్నారు. పోనీ .. ఇంకా మౌనంగా ఉందామా? అంటే.. సామాన్యుల నుంచి నిరంతరం సెగ పెరుగుతూనే ఉంది. దీంతో ఏం చేయాల‌న్నా.. చంద్ర‌బాబుకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి చందంగా మారిపోయింద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News