14 గంటలు @ 74 ఏళ్ల వయసు !

‘‘బెజవాడలో పరిస్థితులు చూస్తే బాధగా ఉంది. కొన్ని వేల మంది ప్రజలు వరదనీటిలో చిక్కుకున్నారు.

Update: 2024-09-02 05:18 GMT

‘‘బెజవాడలో పరిస్థితులు చూస్తే బాధగా ఉంది. కొన్ని వేల మంది ప్రజలు వరదనీటిలో చిక్కుకున్నారు. దీనావస్థలో ఉన్నారు. తాగునీరు కూడా అందుబాటులో లేదు. ఇవన్నీ చూశాక నాకు ఇక్కడి నుండి వెళ్లాలని లేదు. నేను ఇక్కడే ఉంటాను. అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే వరకు నేను అండగా ఉంటాను. ఇళ్లపై ఉన్న వారికి, అందరికీ భరోసా ఇస్తున్నా. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాను. పూర్తిగా వాళ్లను అన్ని విధాలుగా రక్షించే వరకు ఇక్కడే ఉంటాను. బాధితులకు కావాల్సిన నిత్యవసర సరుకులు, తాగునీరు అందిస్తాం” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు భరోసా ఇచ్చారు.


74 ఏళ్ల వయసులో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సోమవారం ఉదయం నాలుగు గంటల వరకు 14 గంటల పాటు చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇవ్వడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తన మంత్రివర్గంలోని ఎవరిని ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలు పరిష్కరించే అవకాశం ఉన్నా చంద్రబాబు తానే రంగంలోకి దిగి బాధితులకు భరోసా కల్పించడం విశేషం.


భారీ వర్షాల కారణంగా విజయవాడ అతలాకుతలం అయింది. అనేక కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో అధికారులు, సహాయక బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేసే పనిని వేగవంతం చేశాయి. బుడమేరు వాగు పొంగడంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు సింగ్ నగర్, రాజీవ్ నగర్, ప్రకాశ్ నగర్, పాయకాపురం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.


వరదలో తమ ఇళ్లలో ఉన్నవారికి తాగునీరు, ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. చంద్రబాబు స్వయంగా అర్థరాత్రి సమయంలో బోటుపై సింగ్ నగర్ లో పర్యటించారు. అందరికీ ఆహారం అందిందా అని అడిగి తెలుసుకున్నారు. కొందరికి ఆహారం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లను అందించారు. 14 గంటల పాటు కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించి సోమవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో విజయవాడ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బస్సులో చంద్రబాబు విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లడం గమనార్హం.


Tags:    

Similar News