క్రైసిస్‌ మేనేజ్మెంట్‌.. కేరాఫ్‌ బాబేనా?

భారీ వర్షాలకు తోడు కృష్ణా నది, బుడమేరు వరదలతో విజయవాడ విలయవాడగా మారింది.

Update: 2024-09-02 14:22 GMT

భారీ వర్షాలకు తోడు కృష్ణా నది, బుడమేరు వరదలతో విజయవాడ విలయవాడగా మారింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఓవైపు కరెంటు లేక, తినడానికి తిండిలేక లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అలమటిస్తున్నారు. సహాయం చేయాలని అధికారులకు ఫోన్‌ చేయడానికి కూడా చార్జింగ్‌ లేక సెల్‌ ఫోన్లు పనిచేయడం లేదు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. తన బసను పూర్తిగా విజయవాడ కలెక్టరేట్‌ కు మార్చుకున్నారు. విజయవాడ సాధారణంగా మారేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆయన ప్రతినబూనారు. ఈ క్రమంలో ఆదివారమంతా లైఫ్‌ బోట్లలో విజయవాడ నగరంలో జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాలను ఆయన సందర్శించారు. బాధితులకు భరోసా ఇచ్చారు. ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. అందరినీ ఆదుకుంటామని కలత చెందొద్దని అభయమిచ్చారు.

ఇక వరుసగా రెండో రోజు కూడా చంద్రబాబు విజయవాడ నగరంలో సుడిగాలి పర్యటనలు చేశారు. కారులో వెళ్లే అవకాశం లేకపోవడంతో స్వయంగా ముంపు ప్రాంతాల్లో జేసీబీ ఎక్కారు. ఈ మేరకు విజయవాడ సితార సెంటర్‌ లో జేసీబీ ఎక్కిన చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు.

గతంలో విశాఖపట్నంలో హుదుద్‌ తుపాను వచ్చినప్పుడు కూడా విశాఖలోనే చంద్రబాబు మకాం వేశారు. స్వయంగా సహాయక చర్యలను పరిశీలించారు. వార్‌ రూమ్‌ ను ఏర్పాటు చేసి సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలించారు. విశాఖ హుదుద్‌ నుంచి కోలుకునేవరకు ఆయన విశాఖను వీడలేదు.

ఇక ఇప్పుడు నాడు విశాఖ మాదిరిగానే విజయవాడ కూడా వరద ముంపులో చిక్కుకుని విలవిల్లాడుతుండటంతో చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌ లోనే మకాం వేశారు. లైఫ్‌ బోట్ల మీద, జేసీబీ మీద.. ఇలా ఏది ఉంటే దానిపైన స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను చేపట్టారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు క్రైసిస్‌ మేనేజ్మెంట్‌ పై ప్రశంసలు కురుస్తున్నాయి. విపత్తు ఏదైనా దాన్ని ఎదుర్కోవడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని సోషల్‌ మీడియాలో నెటిజన్లు కొనియాడుతున్నారు. గతంలో విశాఖలో హుదుద్‌ తుపాను సమయంలో ఇది నిరూపితమైందని.. ఇపుడు విజయవాడ వరదల సందర్భంగా మరోసారి చంద్రబాబులోని అడ్మినిస్ట్రేటర్‌ ను చూడొచ్చని మెచ్చుకుంటున్నారు.

ప్రస్తుతం వర్షాలు తగ్గినా విజయవాడలో ఎక్కడ చూసినా వరద నీరే కన్పిస్తోంది. చుట్టూ వరద నీరు ఉండడంతో ఇంకా వందలాది మంది ఇళ్లలోనే ఉండిపోయారు. కేంద్రం నుంచి జాతీయ విపత్తు దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) సిబ్బంది బోట్లలో సహాయక చర్యలు చేపట్టారు. ఆహారం, నిత్యావసర వస్తువులను వరద ప్రభావిత ప్రాంతాల్లో అందిస్తున్నారు.

Tags:    

Similar News