Begin typing your search above and press return to search.

70 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!?

ఈ సమయంలో షాపులు దక్కించుకున్నవారికి స్థానిక నేతల నుంచి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   15 Oct 2024 5:08 AM GMT
70 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్ట్రాంగ్  వార్నింగ్!?
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ షాపుల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారాదర్శకంగా పూర్తయ్యింది. 26 జిల్లాల పరిధిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ద్వారా షాపులకు ఎంపిక నిర్వహించారు. ఈ సమయంలో షాపులు దక్కించుకున్నవారికి స్థానిక నేతల నుంచి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. దీనిపై సీఎం సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.

అవును... లిక్కర్ షాపులకు సంబంధించి లాటరీలో విజేతలుగా నిలిచి లైసెన్సులు దక్కించుకున్న పలువురికి కొన్ని నియోజకవరాల్లోని ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు, లిక్కర్ సిండికేట్ల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. ఎంతో కొంత గుడ్ విల్ ఇచ్చేస్తాం.. మీ లైసెన్సులు మాకు అప్పగించి వెళ్లిపోండి అంటూ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని అంటున్నారు.

తమ నియోజకవర్గ పరిధిలో వ్యాపారం చేయాలంటే పెట్టుబడి లేకుండానే తమకు 20శాతం వాటా ఇవ్వాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారని.. అలా కానిపక్షంలో వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం! మరికొన్ని చోట్ల నెల నెలా ప్రతీ దుకాణం నుంచి తాము చెప్పినంత తమకు చెల్లించాలని హుకుం జారీ చేస్తున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో... సిండికేట్లతో సంబంధం లేకుండా సొంతంగా దరఖాస్తు చేసుకుని లాటరీలో లైసెన్సులు దక్కించుకున్నవారి పరిస్థితి మరీ దారుణంగా ఉందని అంటున్నారు. వీరిపై గురిపెట్టిన సిండికేట్లు... గుడ్ విల్ చెల్లిస్తామని.. లైసెన్సులు వదిలేయాలని.. లైసెన్సులు తమకు అప్పగిస్తే పెట్టుబడి లేకుండా 10శాతం వాటా ఇస్తామంటూ ఆఫర్లు ఇచ్చారని తెలుస్తోంది.

అయితే ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిందని తెలుస్తోంది. మద్యం దుకాణాల లైసెన్సులు దక్కించుకున్నవారిని కొంతమంది నాయకులు వాటాల కోసం బెదిరిస్తున్నారని.. అందులో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఉన్నారనే విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లిందని అంటున్నారు. దీంతో.. ఈ విషయాన్ని బాబు సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు బెదిరింపులకు పాల్పడుతున్నారనే అంశంపై పార్టీ యంత్రాంగం, నిఘా విభాగం, ఎక్సైజ్ శాఖల ద్వారా సీఎం చంద్రబాబు సమాచారం తెప్పించుకున్నారని తెలుస్తోంది. దీంతో... లైసెన్సుదారులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని ఆయా నేతలకు ఇప్పటికే బాబు నుంచి హెచ్చరికలు వెళ్లాయని అంటున్నారు. ఇందులో సుమారు 70మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చర్చ నడుస్తోంది!

మద్యం, ఇసుక విషయంలో ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని.. సొంతపెత్తనాలు చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించొద్దని.. అలా ఎవరైనా వ్యవహరిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు!