ఔను.. వారంతా ఏకమయ్యారు: ఇదే చంద్రబాబు ఆవేదన!
వాస్తవానికి చంద్రబాబు చేసిన సూచన, హెచ్చరికలు.. కేవలం తెలుగు దేశం పార్టీ నాయకుల గురించే కాదు.. వారు.. మిలాఖత్ అవుతున్న వైసీపీ నాయకులను కూడా ఉద్దేశించి వ్యాఖ్యానించారు.;
నాయకులంతా ఏకమైతే.. పార్టీ అధినేతకు బాధ ఎందుకు ఉంటుంది? ఆ పరిస్తితి గురించి.. ఆయన ఎందుకు తెగ ఆవేదన వ్యక్తం చేస్తారు? ఇదే విషయం.. రాజకీయంగా ఏపీలో చర్చనీయాంశం అయింది. తాజాగా సీఎం చంద్రబాబు పార్టీనాయకులకు, సీనియర్లకు కూడా హెచ్చరికలు చేశారు. ``మీలో మీరు కలిసిపోతే.. ఒకరికొకరు సహకరించుకుంటే.. అది పార్టీని తీరని నష్టం.. పైగా రాష్ట్రానికి కూడా నష్టం`` అని హెచ్చరించారు. దీంతో రాష్ట్రంలో తమ్ముళ్ల పరిస్తితిపై చర్చ సాగుతోంది.
వాస్తవానికి చంద్రబాబు చేసిన సూచన, హెచ్చరికలు.. కేవలం తెలుగు దేశం పార్టీ నాయకుల గురించే కాదు.. వారు.. మిలాఖత్ అవుతున్న వైసీపీ నాయకులను కూడా ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చాలా జిల్లా ల్లో వైసీపీ నేతలతో టీడీపీ నాయకులు మిలాఖత్ అయ్యారన్నది వాస్తవం. ఈ వ్యవహారంపై కొన్నాళ్లుగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇసుక, మద్యం సహా.. ఇతర వ్యాపాల్లోనూ.. ఇరు పక్షాలు కలివిడిగా ముందుకు సాగుతున్నాయి. దీంతో కొన్ని కేసులు తేలిపోతున్నాయి.
గతంలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని అనుకున్నా.. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఆ పరిస్థితి ముందుకు సాగడం లేదు. దీనికి కారణం.. మిలాఖత్తేనని చంద్రబాబుకు సమాచారం ఉంది. ``మీది తెనాలే.. మాది తెనాలే`` అన్నట్టుగా.. నాయకులు కేసులు విషయంలోనూ సహకరించుకుంటు న్నారు. ఇటీవల కర్నూలు, నెల్లూరు, అనంతపురంలోనూ ఈ తరహా ఘటనలు వెలుగు చూశాయి.వైసీపీ నాయకులతో కలిసి వ్యాపారాలు చేస్తున్న కొందరు టీడీపీ నాయకులు వారికి అన్నవిధాలా సహకరిస్తు న్నారు.
ఈ విషయాన్నే సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తాను వైసీపీ నాయకులు చేసిన అరాచకాలపై పోరాటం చేస్తూ.. ప్రజల ఆకాంక్షల మేరకు చర్యలు తీసుకుంటుంటే.. మీరు వారితో చేతులు కలిపి.. పార్టీకి.. ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తీసుకువస్తున్నారన్నది బాబు ఆవేదన. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి సాయం చేయరాదని చెబుతున్నారు. కానీ.. ప్రభుత్వం ఏదైనా.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య కొన్ని కొన్ని జిల్లాల్లో ఇప్పుడే కాదు.. గతంలోనూ అవగాహనా ఒప్పందాలు ఉన్నాయి. దీంతో ఒకరికొకరు సహకరించుకోవడం అనేది కామన్ అయింది. కానీ, ఇప్పుడు చంద్రబాబు వద్దంటున్నారు. మరి తమ్ముళ్లు ఏం చేస్తారో చూడాలి.