భరత్ అలా ఇంకోసారి మాట్లాడొద్దు మంత్రికి చంద్రబాబు వార్నింగ్?
ఇక సమావేశం తర్వాత భరత్ ను పిలిపించిన సీఎం చంద్రబాబు అలా మాట్లాడొద్దంటూ మందలించినట్లు సమాచారం.
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఏపీ కాబోయే సీఎం లోకేశ్ అంటూ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు దావోస్ వెళ్లిన చంద్రబాబు టీంలో మంత్రి టీజీ భరత్ కూడా ఉన్న విషయం తెలిసిందే. సోమవారం జ్యూరిక్ లో జరిగిన తెలుగు పారిశ్రామిక వేత్తల సదస్సులో కాబోయే సీఎం అంటూ భరత్ వ్యాఖ్యానించారు. ఇక సమావేశం తర్వాత భరత్ ను పిలిపించిన సీఎం చంద్రబాబు అలా మాట్లాడొద్దంటూ మందలించినట్లు సమాచారం.
గత మూడు నాలుగు రోజులుగా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రకటనలు కూటమిలో కీలక భాగస్వామి జనసేనతో ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతున్నందున రంగంలోకి దిగిన చంద్రబాబు ఆ ప్రకటనల పర్వానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా పార్టీ కార్యాలయ బాధ్యులకు సూచించారు. అలా చంద్రబాబు సూచించిన కొన్ని గంటలకే.. ఆయన సమక్షంలోనే లోకేశ్ కాబోయే సీఎం అంటూ భరత్ వ్యాఖ్యానించడం సంచలనం రేపింది.
మంత్రి భరత్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అని చీవాట్లు పెట్టినట్లు సమాచారం. మనం ఇక్కడికి వచ్చింది దేనికి? నువ్వు మాట్లాడింది ఏంటి? ఏదైనా సమయం సందర్భం ఉండక్కర్లేదా? అంటూ మంత్రి భరత్ ను చంద్రబాబు నిలదీశారని చెబుతున్నారు. మరోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారని అంటున్నారు.
కాగా, ఉన్నత విద్యావంతుడైన లోకేశ్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడని, ఏపీలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపిస్తే భవిష్యత్తులో ఏమవుతుందోననే ఆందోళన పారిశ్రామిక వేత్తల్లో ఉందని చెబుతూ, వారికి భరసా ఇచ్చే క్రమంలో భవిష్యత్తులో లోకేశ్ సీఎం అవుతారంటూ భరత్ ప్రకటన చేశారు. అయితే ఇప్పటికే లోకేశుకు డిప్యూటీ సీఎం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో భరత్ ప్రకటన మరింత మంట రాజేసింది. దీంతో వెంటనే చంద్రబాబు రంగంలోకి పరిస్థితిని అదుపు చేశారు.