ఈసారి చంద్రబాబు పక్కనే పవన్ కల్యాణ్
రాష్ట్ర విభజన తర్వాత కొన్నిరాజకీయ పరిణామాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలను పోల్చటం అలవాటుగా మారింది.
రాష్ట్ర విభజన తర్వాత కొన్నిరాజకీయ పరిణామాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలను పోల్చటం అలవాటుగా మారింది. గత ఏడాది చివర్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటం.. ప్రభుత్వాన్నిఏర్పాటు చేయటం తెలిసిందే. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా.. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కను ఎంపికయ్యారు. గతానికి భిన్నంగా ఉప ముఖ్యమంత్రి పదవికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటమే కాదు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యే విషయం మొదలు అధికారిక సమావేశాలు.. రివ్యూలలో డిప్యూటీ సీఎం భట్టికి లభిస్తున్న ప్రాధాన్యత తెలిసిందే.
ఇదిలా ఉంటే ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఎంపిక కావటం తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే.. చాలా ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం పదవుల్ని చేపట్టిన నేతలు బలమైన వారిగా.. గౌరవ మర్యాదల విషయంలో ముఖ్యమంత్రి తర్వాత వారే అన్నట్లుగా సాగటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టికి సీఎం రేవంత్ ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో.. అంతే ప్రాధాన్యతను పవన్ కు చంద్రబాబు ఇవ్వాలని కోరుకుంటున్నారు.
ఈ క్రమంలో పలు సందర్భాల్లో భట్టికి ఇస్తున్న ప్రాధాన్యత వర్సెస్ జనసేనానికి ఇస్తున్న ప్రాధాన్యత మీద పోలిక మొదలైంది. ఈ మధ్యన ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లటం.. జాతీయనాయకుల్ని కలవటం తెలిసిందే. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీకి వెళ్లకపోవటాన్ని పలువురు ప్రస్తావించటం తెలిసిందే. అంతేకాదు.. కేబినెట్ భేటీలోనూ పవన్ కు కేటాయించే స్థానం.. తెలంగాణలో డిప్యూటీ సీఎం భట్టికి కేటాయించే స్థానంతో పోలిస్తే భిన్నంగా ఉండటాన్నిపలువురు చర్చించుకుంటున్న పరిస్థితి.
ఇలాంటి వేళ.. తాజాగా కలెక్టర్ల సదస్సును నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కనే ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కల్యాణ్ ను కూర్చోబెట్టుకోవటం కనిపిస్తుంది. ఈ ఫ్రేమ్ లో మరో మంత్రి లోకేశ్ చివరి స్థానంలో కూర్చుంటే.. పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబు పక్కనే ఉన్నారు. ఏపీ సచివాలయం వేదికగా జరిగిన ఈ రివ్యూలో పవన్ కు సముచిత ప్రాధాన్యత లభించినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.