బ్రేకింగ్: చంద్రబాబు అరెస్ట్
చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయనను విజయవాడ తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.
ఏపీ రాజకీయాలలో సంచలన పరిణామం జరిగింది. గత రెండు రోజులుగా వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో పోలీసులు అరెస్టు చేయడం సంచలం రేపింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏ-1గా అయిన చంద్రబాబుకు ఏపీ సీఐడీ, సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు అరెస్టుతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయనను విజయవాడ తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.
అరెస్టు సందర్భంగా పోలీసులకు, చంద్రబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎలాంటా ఆధారాలు లేకుండా, కోర్టులో విచారణ జరుగుతుండగా అరెస్ట్ చేయడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. కేసు పేపర్లు, ఎఫ్ఐఆర్ కాపీ చూపించాలని సిట్ , సిఐడి అధికారులను కోరారు. రిమాండ్ రిపోర్ట్ ఇవ్వలేమని, అరెస్టుకు గల కారణాలను, ఆ స్కామ్ లో చంద్రబాబు పాత్రను కోర్టుకు వివరించామని పోలీసులు చెబుతున్నారు.
ఆ స్కామ్ లో తన పేరు చూపించాలని చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదని లాయర్లు ప్రశ్నించగా...అరెస్టు తర్వాత తగిన పత్రాలు ఇస్తామని పోలీసులు చెప్పారు.తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వాస్తవానికి శుక్రవారం అర్ధరాత్రి నుంచి నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబును అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గరకు వేలాదిమంది టీడీపీ కార్యకర్తలు వచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబు బస్సు వద్దకు డీఐజీ రఘురామిరెడ్డి, నంద్యాల ఎస్పీ రఘురారెడ్డితో పాటు పలువురు పోలీసు అధికారులు చేరుకున్నారు. చంద్రబాబు బస చేసిన బస్సు డోరును కొడుతూ అర్ధరాత్రి అరెస్టు చేయాలని చూడగా..లాయర్లు, టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులకు, టిడిపి నాయకులు, కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. ఎట్టకేలకు హైడ్రామా మధ్య శనివారం ఉదయం 6 గంటల తర్వాత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
చంద్రబాబు అరెస్టుతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో, అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.