బీజేపీతో పొత్తు వెనక ఉన్నది అతనే...బాబు సంచలన కామెంట్స్...!?
ఇక ఈ పొత్తులు 2014 మాదిరిగా హిట్ అవుతాయా అన్నది వేరే చర్చ. అయితే బీజేపీతో పొత్తు ఎందుకో చంద్రబాబు టీడీపీ అనేక సార్లు చెప్పుకొచ్చారు
బీజేపీతో పొత్తు టీడీపీ కుదుర్చుకుంది. ఇది జరిగి వారం దగ్గర కావస్తోంది.ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అన్నది వామపక్షాల నుంచి అంతా అడుగుతున్న ప్రశ్నలు. ఏపీకి సంబంధించి ఏ హామీని బీజేపీ నెరవేర్చలేదని ప్రత్యేక హోదా ఇవ్వలేదని అలాంటి బీజేపీతో పొత్తు దేనికి అని అడుగుతున్నారు.
ఇక ఈ పొత్తులు 2014 మాదిరిగా హిట్ అవుతాయా అన్నది వేరే చర్చ. అయితే బీజేపీతో పొత్తు ఎందుకో చంద్రబాబు టీడీపీ అనేక సార్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అని కూడా వెల్లడించారు. ఇదిలా ఉంటే శుక్రవారం మంగళగిరిలో టీడీపీ ఆఫీసులో చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీ పొత్తు వెనక ఉన్నది ఎవరో కాదు జగనే అని సంచలన కామెంట్స్ చేశారు.
అవును జగన్ కోసమే పొత్తు పెట్టుకున్నామని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ లాంటి నాయకుడు ఏపీలో ఉండరాదు ఆయన పార్టీ కూడా చిత్తు చిత్తుగా ఓడిపోవాలని పొత్తు పెట్టుకున్నామని అన్నారు. వైసీపీకి ఎక్కడా డిపాజిట్లు కూడా రాకూడదని, ఆ పార్టీ అసలు నామరూపాలు లేకుండా పోవాలన్నదే తమ ఉద్దేశ్యం అని బాబు ఆవేశపూరితంగా చెప్పారు.
ఏపీని అన్ని విధాలుగా సర్వనాశనం చేసిన జగన్ పాలనకు మాత్రమే కాదు రాజకీయాలకే అనర్హుడు అని బాబు తేల్చేశారు. ఏపీ మరింతగా దారుణంగా తయారు కాకుండా ఉండాలనే బీజేపీతో పొత్తుకు వెళ్లామని అన్నారు. అన్ని విధాలుగా దెబ్బ తిన్న ఏపీని బాగు చేయడం కోసమే బీజేపీతో మరోసారి చేతులు కలిపామని బాబు చెప్పుకొచ్చారు.
జగన్ వంటి వారిని ఎన్నుకోవడం ద్వారా ఏపీ ప్రజలు గతంలో ఎన్నడూ చూడని చేదు అనుభవాలు గత అయిదేళ్ళుగా చూశారు అని బాబు అన్నారు. ఏపీలో ఎవరికీ రక్షణ లేకుండా పోయింది అని ఆయన మండిపడ్డారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న తన లాంటి వారికే అడ్డుకోవాలని చూశారని ఆయన గుర్తు చేశారు. ఇక ఏపీలో ప్రతీ రోజూ విపక్షాల మీద కేసులు పెట్టడమే అయిదేళ్ల జగన్ పాలనగా సాగిందని దానికి చరమ గీతం పాడేందుకే ఎన్నికలు వచ్చాయని అన్నారు.
ఎన్నికల అనంతరం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జగన్ ప్రభుత్వం అమాయకుల మీద పెట్టిన అక్రమ కేసులను సమీక్షిస్తామని ఆయన చెప్పారు. ఏపీలో జగన్ బాధితులే జనంలోకి వెళ్ళి అసలు విషయాలు చెప్పాలని అన్నారు. అలాగే ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక అంతా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే పనిచేయాలి తప్ప జగన్ కింద కాదు అని అధికారులు వ్యవస్థలు గుర్తుంచుకోవాలని అన్నారు.
ఏపీని ప్రజలే రక్షించుకోవాలని బాబు పిలుపు ఇచ్చారు. తనకు ఎవరి మీదా కోపం లేదని ఏపీ అభివృద్ధే తన లక్ష్యం అని చంద్రబాబు అన్నారు. ఏపీలో వైసీపీ లేని పాలన రావాలని ఆయన అంటున్నారు. మళ్లీ వైసీపీ వస్తే అది ఏపీలో అయిదు కోట్ల ప్రజల ఖర్మ అవుతుందని ఆయన హెచ్చరించారు. మొత్తానికి జగన్ ని గద్దె దించేందుకే తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను అని బాబు సంచలన కామెంట్స్ చేశారు. వీటి మీద ఇపుడు చర్చ సాగుతోంది.