మోడీ కోసం వారణాసిలో బాబు ప్రచారం ?
నరేంద్ర మోడీ చంద్రబాబు ఇద్దరూ ఒకే ఏజ్ వారు. ఇద్దరూ ఏడున్నర పదుల వయసులో ఉన్నారు.
నరేంద్ర మోడీ చంద్రబాబు ఇద్దరూ ఒకే ఏజ్ వారు. ఇద్దరూ ఏడున్నర పదుల వయసులో ఉన్నారు. మోడీ 2001 నుంచి సీఎం గా గుజరాత్ కి ఉన్నారు. బాబు అంతకు ముందు 1995 నుంచే ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్నారు. బాబు రాజకీయాలలో మోడీ కంటే చాలా సీనియర్. ఆయన కెరీర్ 1978 నుంచి ప్రారంభం అయింది మంత్రిగా ఉంటూ పార్టీలో కీలక నేతగా ఎదిగి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఇక బాబు 45 ఏళ్ళకే సీఎం అయితే మోడీ ఆ సీటు ఎక్కేసరికి 51 ఏళ్ళ వయసు వచ్చింది.
అయితే మోడీ ప్రత్యేకత ఏంటి అంటే నేరుగా సీఎం కావడం.అంతే కాదు ఏకంగా 13 ఏళ్ల పాటు నిరాటంకంగా సీఎం గా పాలించడం. ఇక ప్రధానిగా పదేళ్ళ పాటు ఆయన ఉన్నారు. మరోసారి గెలిస్తే ప్రధానిగా గాంధీ కుటుంబం రికార్డు కి దరిదాపుల్లోకి వస్తారు.
ఇక నరేంద్ర మోడీ చంద్రబాబు ఇద్దరూ వ్యూహాలలో చాతుర్యం కలిగిన వారే. ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి విడిపోయి మళ్ళీ 2024 ఎన్నికల ముందు కలిశాక ఇద్దరి మధ్య స్నేహ బంధం ఇంకా గట్టి పడింది అని అంటున్నారు మార్చి 16న జరిగిన చిలకలూరి సభలో చంద్రబాబు ప్రసంగం విన్న నరేంద్ర మోడీ వేదిక మీదనే అభినందించారు. పైగా మీరు మంచి ఆరోగ్యంగా ఉన్నారు భేష్ అని కితాబు ఇచ్చారు.
ఇక ఆ తరువాత ఎన్నికల సభలకు వచ్చిన మోడీ బాబు పాలన ఏపీలో బాగా సాగింది. ఆయన మంచి పాలనా దక్షుడు అని ప్రశంసించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బాబు పట్ల మోడీకి మంచి గురి కుదిరింది అని అంటున్నారు. ఇటీవల వారణాసిలో నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి ప్రత్యేకంగా బాబుని పిలిచారు. ఆ తరువాత ఇద్దరూ అక్కడ కొంత సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారని అంటున్నారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోడీ వారణాసిలో తనకు మద్దతుగా ప్రచారం చేయమని బాబుని కోరారని అంటున్నారు. ఏపీ ఎన్నికల్లో తీరుబాటు లేకుండా తిరిగి ప్రచారం చేసిన బాబు ఆరోగ్యం విషయం మొదట వాకబు చేసిన మోడీ శ్రమ అనుకోకపోతే వారణాసిలో తనకు ప్రచారం చేసి పెట్టాలని కోరినట్లుగా చెబుతున్నారు.
వారణాసిలో పెద్ద ఎత్తున తెలుగువారు ఉన్నారు. ఆయా ప్రాంతాలలో ప్రచారం చేయాలని మోడీ స్వయంగా కోరారని తెలుగుదేశం పార్టీ వర్గాలలో చర్చ సాగుతోంది. జూన్ 1న వారణాసిలో ఎన్నిక జరగనుంది. ఇంకా టైం ఉన్నందువల్ల బాబు ఒకటి రెండు రోజుల పాటు వీలు చూసుకుని వారణాసిలో తెలుగు వారు అధికంగా ఉండే ప్రాంతంలో ప్రచారం చేస్తారు అని అంటున్నారు. మోడీ అంతటి వారు అడిగిన తరువాత అది ఒక విధంగా తమకు ఎంతో మేలు చేసేదే అని కూడా బాబు సహా టీడీపీ పెద్దలు భావిస్తున్నారుట.
మరో వైపు చూస్తే మోడీ కూడా బాబుని పూర్తిగా నమ్ముతూ తన ప్రియ నేస్తంగా చేసుకున్నారని ట్విట్టర్ వేదికగా చంద్రబాబుని ఆయన అలాగే సంభోదిస్తారు అని అంటున్నారు. ఇక కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఏ మాత్రం మెజారిటీ రాకపోతే బాబు పాత్ర ఢిల్లీలో చాలా కీలకం అవుతుందని కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. రానున్న రోజులలో మోడీ బాబు బంధం ఇంకా పటిష్టం అవుతుందని టీడీపీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయని అంటున్నారు.