తెలంగాణాలో వేలు పెట్టనంటున్న చంద్రబాబు...!?
జాతీయ హోదా సాధించాలంటే తెలంగాణాలో కూడా పోటీ చేయాలి. అక్కడ కూడా సత్తా చాటాలి.
టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి జాతీయ హోదా అయితే లేదు. ఆయన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఇంకా ప్రాంతీయ పార్టీగానే ఉంది. జాతీయ హోదా సాధించాలంటే తెలంగాణాలో కూడా పోటీ చేయాలి. అక్కడ కూడా సత్తా చాటాలి. కానీ చంద్రబాబు తీరు చూస్తే తెలంగాణాను పక్కన పెట్టేసినట్లుగా కనిపిస్తోంది.
ఇప్పటికి నాలుగైదు నెలల క్రితం జరిగిన తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. దానికి మొదట్లో చెప్పిన కారణం చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉన్నారు అని. కానీ తీరా నామినేషన్ల పర్వం టైం కి ఆయన బయటకు వచ్చారు. అయినా సరే టీడీపీ పోటీ చేయలేదు. దాంతో ఆగ్రహించిన అప్పటి తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీని వీడిపోయారు.
చాలా మంది నేతలు పార్టీని వదిలారు. అంతదాకా ఎందుకు నందమూరి ఆడపడుచు సుహాసిని కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. అంటే ఆమె కాంగ్రెస్ లో చేరుతారు అని అంటున్నారు. ఇలా టీడీపీ తెలంగాణలో కకావికలం అవుతునన్నా ఆ వైపు చంద్రబాబు తొంగి చూడడంలేదు.
ఇక కాసాని పార్టీ నుంచి వెళ్లాక కొత్త ప్రెసిడెంట్ ని కూడా తెలంగాణా టీడీపీకి నియమించలేదు. దాంతో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణాలో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్న చర్చ సాగుతోంది. అయితే ఒక వైపు నామినేషన్లకు నోటిఫికేషన్ రావడానికి పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటిదాకా తెలంగాణా టీడీపీ నేతలను పిలిచి ఒక్క మీటింగ్ కూడా అధినాయకత్వం పెట్టలేదు అని అంటున్నారు.
దాంతో టీడీపీకి ఎంతో కొంత బలం ఉన్న మెదక్, రంగారెడ్డి సికింద్రాబాద్ నల్గొండ, నిజామాబాద్ వంటి చోట్ల ఎంపీలుగా పోటీ చేయాలని చూస్తున్న ఆశావహులకు గట్టి షాక్ తగిలింది. ఏపీ ఎన్నికలతో తలమునకలు అయి ఉన్న చంద్రబాబుకు ఏపీ ఇప్పుడు ముఖ్యం అంటున్నారు.
ఇక్కడ చావో రేవో అన్నట్లుగా ఎన్నికలు ఉన్నాయి. ఈసారి కనుక ఏపీలో గెలవకపోతే టీడీపీ అస్థిత్వానికే ముప్పు అని అంటున్నారు. దాంతో టీడీపీ ఫుల్ ఫోకస్ అంతా ఏపీ మీదనే పెట్టేసింది. దాంతోనే తెలంగాణా ఎన్నికలకు చంద్రబాబు సమయం ఇవ్వడం లేదు. న్యూట్రల్ విధానం అనుసరించాలని అనుకుంటున్నారు అంటున్నారు.
ఇక మరో విశేషం కూడా ఇక్కడ ఉంది. అందులో బాబు వ్యూహం కూడా ఉంది అని అంటున్నారు. అదెలా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు అన్నీ కాంగ్రెస్ కి మళ్ళి ఆ పార్టీ విజయానికి కారణం అయ్యాయి. ఇపుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పొటీ పడకపోతే కాంగ్రెస్ కే లాభం. అలా కాంగ్రెస్ రాజకీయంగా ఎదగడమే టీడీపీకి కావాల్సింది అని అంటున్నారు.
కాంగ్రెస్ ఎంత ఎదిగితే అంతలా బీఆర్ ఎస్ తగ్గిపోతుంది. బీఆర్ ఎస్ ఎపుడైతే తగ్గిపోతుందో ఆ ప్లేస్ లోకి రావడానికి టీడీపీకి అవకాశం ఉంటుంది. బీజేపీ రేసులో ఉన్నా ఆ పార్టీకి టీడీపీకి ఉన్నంతగా గ్రౌండ్ లెవెల్ లో బలం లేదు అని అంటున్నారు. అందుకే టీడీపీ కోరి మరీ పోటీ నుంచి తప్పుకుంటోంది అంటున్నారు. ఇపుడు ఏపీలో గెలిస్తే ఆటోమేటిక్ గా తెలంగాణాలోనూ పుంజుకోవచ్చు అన్నది కూడా బాబు ఆలోచన అంటున్నారు. మొత్తానికి చూస్తే తెలంగాణాలో పోటీ నుంచి టీడీపీ తప్పుకున్నట్లే అంటున్నారు.
అయితే జాతీయ అధ్యక్షుడు అని చంద్రబాబు చెప్పుకోవచ్చా అంటే అది ఆయన పార్టీ ఇష్టం అంటున్నారు. ఈసీ మాత్రం టీడీపీని ప్రాంతీయ పార్టీగానే చూస్తోంది. సో టీడీపీ ఇప్పటికి అయితే ఏపీకే పరిమితం కావాలని అనుకుంటోంది అంటున్నారు.