అందరికీ ఫ్రీ అంటున్న బాబు...పూర్తిగా మారిపోయారా ?

మీరు బాగా పనిచేయండి. వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్ళండి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రండి అని కలెక్టర్లకు బాబు చెప్పాల్సింది చెప్పారు.

Update: 2024-08-06 17:08 GMT

చంద్రబాబుని 2009 ఎన్నికల వేళ ఆనాటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్సార్ ఒక మాటతో విమర్శలు చేస్తూ వచ్చేవారు. అదేంటి అంటే ఆల్ ఫ్రీ బాబు అని. టీడీపీ అప్పట్లో అనేక ఉచిత పథకాలు మేనిఫేస్టోలో పెట్టింది. దాని మీద వైఎస్సార్ అలా సెటైర్లు వేసేవారు. ఆల్ ఫ్రీ బాబును నమ్మొద్దు అని జానాలకు కూడా చెబుతూ ఉండేవారు.

కట్ చేస్తే చంద్రబాబు 2014లో అలాగే 2024లో ఎన్నో ఉచిత హామీలు ఇచ్చారు. వాటి అమలు సంగతి పక్కన పెడితే ఆయన పాలనలో మాత్రం కొత్తదనం చూపిస్తున్నారు. నేను మారాను అని పక్కాగా నిరూపించుకుంటున్నారు. చంద్రబాబు కలెక్టర్ల సమావేశం పెట్టి మరీ వారికి దిశా నిర్దేశం చేశారు. అదే సమయంలో వారికి ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చారు.

మీరు బాగా పనిచేయండి. వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్ళండి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రండి అని కలెక్టర్లకు బాబు చెప్పాల్సింది చెప్పారు. గతంలో అయితే ప్రతీ చిన్న విషయం మీద కూడా ప్రభుత్వం వైపు చూసేలా కలెక్టర్ల వ్యవస్థను మార్చారు. వారు జిల్లాలకు అత్యున్నత అధికారులు అయినప్పటికీ వారికి అంటూ కొన్ని విశేష అధికారాలు ఉన్నప్పటికీ రాజకీయంగానే జోక్యం ఎక్కువగా ఉండేది.

దాంతో కలెక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. అయితే చంద్రబాబు మాత్రం రాజకీయ జోక్యం లేకుండా చూస్తామని చెప్పారు. అంతే కాదు కలెక్టర్లు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ప్రగతికి దోహదం చేయాలని కోరారు. మంచి పాలనను అంతా కలసి అందిద్దామని ఆయన పిలుపు ఇవ్వడం విశేషం.

బాగా పనిచేసే కలెక్టర్ల విషయంలో ప్రోత్సాహం ఉంటుందని వారిని ఉన్న చోటనే మరింత కాలం కొనసాగిస్తామని ఇది అభివృద్ధికి కూడా అవసరం అని బాబు చెప్పారు. అలాగే పాలనను చక్కగా సాగేలా జిల్లాల స్థాయిలో కలెక్టర్లు చూడాలని ఆయన కోరారు. అసమర్థ ప్రభుత్వం అన్న మాటను వినేందుకు తాను సిద్ధంగా లేనని బాబు చెప్పారు. సమర్ధత ఎక్కడికక్కడ చాటు కోవాలని ఈ విషయంలో కలెక్టర్ల పనితీరుని సైతం మదింపు చేస్తామని బాబు చెప్పారు.

మరో వైపు మంత్రులకు కూడా చంద్రబాబు స్వేచ్చ ఇచ్చారు. ఎవరి మంత్రిత్వ శాఖలలో వారు పనిచేసుకునే వాతావరణం కల్పిస్తున్నారు. ఆయా శాఖల గురించి మంత్రులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కీలక నిర్ణయాలను గురించి కూడా ప్రకటనలు చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే మంత్రులు కానీ కలెక్టర్లు కానీ ఉన్నతాధికారులు కానీ బాబు నిర్ణయం కరెక్ట్ అంటున్నారు.

సమిష్టిగా పనిచేయాలన్న బాబు వైఖరి పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. దాంతో బాబు ఫ్రీ ఇచ్చేశారు అని అంటున్నారు. అయితే బాబు ఇచ్చిన ఈ ఫ్రీని వాడుకుంటూ మంచి పాలన అందించాల్సి ఉంది. లేకపోతే బాబు తనదైన పని తీరుని చూపిస్తారు. మార్కులు వేసి మరీ వెనక్కి పెట్టే అవకాశమూ ఉంది.

Tags:    

Similar News