ఇటు ముఖ్యమంత్రి... అటు ఉక్కు మంత్రి ... విశాఖ దశ తిరుగుతుందా ?
ఏజెన్సీలో రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ వైసీపీకి తప్ప ఉత్తరాంధ్ర మొత్తం కూటమి ఊడ్చి పారేసింది.
విశాఖకు దశ తిరుగుతుందా అన్న చర్చ సాగుతోంది. విశాఖ నగరం ఎన్నో సమస్యలతో ఉంది. అందులో విభజన తరువాత ఉన్నది కొత్తవి కలిపి చాలానే ఉన్నాయి. అవి ఏళ్లుగా పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయి. తాజాగా టీడీపీ కూటమిని ఏకగ్రీవంగా ఎన్నుకుని విశాఖ జిల్లా జై కొట్టింది. ఏజెన్సీలో రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ వైసీపీకి తప్ప ఉత్తరాంధ్ర మొత్తం కూటమి ఊడ్చి పారేసింది.
దాంతో ఉత్తరాంధ్రాతో పాటు దాని ముఖద్వారంగా ఉన్న విశాఖ నగరం కూడా కూటమి పాలకులు కేంద్ర రాష్ట్రాల నుంచి విశాఖ సహా ఉత్తరాంధ్రకు ఏమి చేయబోతున్నారు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశాఖకు ఒకే రోజున ఇద్దరు కీలక నేతలు విడిది చేయబోతున్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డి కుమార స్వామి విశాఖనే తన తొలి పర్యటన గా ఎంచుకున్నారు.
ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించి అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. విశాఖ ఉక్కు ని ప్రైవేట్ పరం కాకుండా రక్షించాలంటూ గత మూడేళ్ళుగా కార్మికులు అలుపెరగని తీరున ఆందోళనలు చేస్తున్నారు. దాంతో ఉక్కుని పరిరక్షిస్తే విశాఖ సహా ఉత్తరాంధ్ర కు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
మరో వైపు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం గా నాలుగవ సారి ప్రమాణం చేశాక విశాఖ వస్తున్నారు. ఆయన విశాఖలో ఎడ తెగని కార్యక్రమాలతో పూర్తి బిజీగా పర్యటించనున్నారు. ఈ నెల 11న సీఎం చంద్రబాబు అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటనలు వరసగా చేయనున్నారు.
చంద్రబాబు అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి చేరుకుని పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అలాగే విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టును సందర్శిస్తారు. అక్కడ పనులు జరుగుతున్న తీరుపై ఉన్నత అధికారులతో సమీక్షిస్తారు. చంద్రబాబు అక్కడ నుంచి మెడ్ టెక్ లో జరిగే సీఐఐ సదస్సులో అలాగే విశాఖ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. విశాఖలో గత ఐదేళ్లలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్ష నిర్వహిస్తారు.
ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక వైపు ఉక్కు మంత్రి కుమార స్వామి మరోవైపు రానుండడంతో విశాఖ సమస్యలు పరిష్కారం అవుతాయా అన్న ఆశ అందరిలో కనిపిస్తోంది. చంద్రబాబు విశాఖ నగర అభివృద్ధి జిల్లా ప్రగతి మీద చేసే చర్చ గురించి కూడా అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్ర కూటమికి ఎంతో ఇచ్చింది. మరి కూటమి పాలకులు ఈ ప్రాంతానికి ఏ వరాలు మోసుకొస్తున్నారు అన్నదే అంతా చర్చించుకుంటున్న విషయం.