తమ్ముళ్ళూ అంతొద్దు ..చంద్రబాబు లోకేష్ సందేశం..
తెలంగాణా ఫలితం ఏదైనా కానీ అది ఆ రాష్ట్ర ప్రజల అభిమతం, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చిన తీర్పుగా భావించాలి అని వారు పేర్కొనడం విశేషం.
అవును తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలోని తమ్ముళ్ళు పొంగిపోతున్నారు. సోషల్ మీడియాలో ఒక్క లెక్కన పోస్టులతో కుమ్మేస్తున్నారు. ఇది ఎటు తిరిగి ఎటు వెళ్తుందో అన్న ఆలోచన అధినాయకత్వంలో కలిగినట్లుంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ ఒక కీలక సందేశం పంపించారు.
తెలంగాణా ఫలితం ఏదైనా కానీ అది ఆ రాష్ట్ర ప్రజల అభిమతం, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చిన తీర్పుగా భావించాలి అని వారు పేర్కొనడం విశేషం. ఇక ఈ ఫలితాలను చూసి మీరు వ్యక్తిగత అభిప్రాయాలను గెలిచిన వారికి తెలియచేయవచ్చు. వారిని అభినందించవచ్చు. కానీ ఓడిపోయిన వారిని ఆ పార్టీలను పలుచన చేయవద్దు అంటూ చంద్రబాబు లోకేష్ ఇచ్చిన సందేశంలో ఉంది.
ఇక ఎన్నికలలో గెలుపు ఓటములు అత్యంత సహజం అని చంద్రబాబు లోకేష్ పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీగా టీడీపీ ఉంది. అధికార పక్షంగానూ ప్రతిపక్షంగానూ కీలకమైన పాత్ర పోషించింది అని గుర్తు చేశారు. అయినా సరే టీడీపీ ఎంతో హుందాగా వ్యవహరించింది అని వారు పేర్కొన్నారు.
అందువల్ల తెలంగాణా ప్రజల అభిప్రాయాన్ని గౌరవిద్దామని వారు పేర్కొన్నారు. ఏపీలో జరిగే ఎన్నికల మీద దృష్టి పెడదామని ఆయన సూచించడం విశేషం. మొత్తానికి తెలంగాణా ఎన్నికల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న తమ్ముళ్ల వల్ల భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు కలుగుతాయని భావించే ఈ విధంగా పెదబాబు చినబాబు స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటున్నారు.
అంతే కాదు బీయారెస్ బీజేపీల ఓటమి మీద వచ్చే కామెంట్స్ కూడా టీడీపీకి ఇబ్బందిని కలిగిస్తాయని భావించే ఇలా చేశారు అని అంటున్నారు. మొత్తానికి తమ్ముళ్ల ఆనందానికి అంతొద్దు ఇది చాలు అన్నట్లుగా ఒక చిన్నపాటి హద్దులు అయితే పెట్టేశారు అని అంటున్నారు.