జనాల మధ్యలో మాజీ ఎమ్మెల్యే సతీమణి.. గుర్తు పట్టిన బాబు ఏం చేశారంటే?
రాజకీయ నేతలంతా ఒకేలా ఉండరు. ఇవాల్టి రోజున కూడా విలువలు.. సిద్ధాంతాలను ఫాలో అయ్యే వారెందరో.
రాజకీయ నేతలంతా ఒకేలా ఉండరు. ఇవాల్టి రోజున కూడా విలువలు.. సిద్ధాంతాలను ఫాలో అయ్యే వారెందరో. చెడుకు వచ్చే ప్రచారం.. మీడియా అటెన్షన్ మంచికి రాదు. అలానే.. చిన్న చిన్ననేతలు సైతం హడావుడి చేస్తుంటారు. కానీ.. కొందరిలో అడ్డు వచ్చే ఆత్మాభిమానం.. అదే సమయంలో సాయాన్ని ఎలా అడగాలో అర్థం కాక ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటి వారిని గుర్తించి.. ఆదరించే అధినేతలు అతి కొద్ది మంది ఉంటారు. తాజాగా అలాంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరు తెలుగుదేశం పార్టీ నేతల్ని మాత్రమే కాదు ప్రజల మనసుల్ని టచ్ చేస్తోంది.
2018లో అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో మావోల దాడిలో టీడీపీ నేత, ఎమ్మెల్యే సివేరి సోమ మృతి చెందారు. కొద్ది కాలానికే ప్రభుత్వం మారటం తెలిసిందే. కట్ చేస్తే.. తాజాగా సివేరి సోమ సతీమణి.. తన కొడుకును తీసుకొని మంత్రి లోకేశ్ ను కలిసేందుకు అమరావతి వచ్చారు. కానీ.. ఆయన అందుబాటులో లేకపోవటంతో ఆమెకు ఏం చేయాలో తోచలేదు.
ఈ క్రమంలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు కరకట్ట వద్ద ఉండే ప్రజలతో పాటు నిలుచున్నారు. ఉండవల్లిలోని ఇంటినుంచి బయలుదేరి సచివాలయానికి కారులో వెళుతున్న చంద్రబాబు.. ప్రజలతో పాటు నిలబడి ఉన్న సివేరి సోమ సతీమణిని గుర్తించారు. వెంటనే కారును ఆపిన ఆయన.. ఆమెను.. ఆమె కుమారుడిని కలిశారు. యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబాన్నిఆదుకోవాలని.. తన కొడుకు చదువు గురించి కోరగా.. వెంటనే స్పందించిన ఆయన.. ఉన్నత చదువుల వరకు తనదే బాధ్యతగా పేర్కొన్నారు.
అంతేకాదు.. పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామన్న చంద్రబాబు.. ఆమెను ధైర్యంగా ఉండాలని కోరారు. వాహనంలో వెళుతున్న చంద్రబాబు తమను చూసి గుర్తు పట్టటమే కాదు.. కారు ఆపి మాట్లాడిన వైనంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమను ఆదరించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వందలాది మంది ఉన్న చోట.. దివంగత పార్టీ ఎమ్మెల్యే సతీమణిని, ఆమె కుమారుడ్ని గుర్తు పట్టి స్పందించిన బాబు తీరు అందరిని ఆకట్టుకుంటోంది.