వారందరిపైనా రౌడీ షీట్లు-సునీతకు సాయం: చంద్రబాబు
గత వైసీపీ హయాంలో అరాచకాలకు పాల్పడిన అందరినీ గుర్తిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు
గత వైసీపీ హయాంలో అరాచకాలకు పాల్పడిన అందరినీ గుర్తిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. గత వైసీపీ హయాంలో రాజకీయ విధ్వంసాలు, హత్యల్లో పాలు పంచుకున్న ఏ ఒక్కరినీ వదిలేది లేదని తెలిపారు. 2019 జూన్ నుంచి 2024 మే వరకు అన్ని రికార్డులను పరిశీలించను న్నట్టు తెలిపారు.
జిల్లాల వారీగా నేరస్తుల లిస్టులను తయారు చేయమని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్న చంద్రబాబు.. వారి వివరాలను తీసుకుని.. ప్రతి ఒక్కరిపైనా రౌడీ షీట్లు తెరుస్తామని చెప్పారు. ఏ ఒక్కరినీ జాలి పడి వదిలేది లేదన్నారు. ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ పెడరెక్కలు విరిచి కట్టి నడిరోడ్డుపై ఆయనను కుక్కను తీసుకువెళ్లినట్టు తీసుకువెళ్లారని.. ఇది పోలీసులు చేసిన పనేనని.. అయితే.. దీనిని తెరవెనుక ఉండి చెయించిందెవరనే విషయంపై దృష్టి పెట్టామన్నారు. చేసిన వారిని ఇప్పటికే కోర్టులు శిక్షించాయని.. కేసు విచారణలో ఉందన్నారు.
అయితే.. డాక్టర్ సుధాకర్ విషయంలో అమానుషంగాప్రవర్తించేలా ప్రోత్సహించిన వారిని కూడా బయట కు లాగి రౌడీ షీట్లు పెడతామన్నారు. అదేవిధంగా హూకిల్డ్ బాబాయ్ కేసు అత్యంత దారుణమని.. త్వరలోనే నిజానిజాలు వెలుగు చూస్తాయని చంద్రబాబు చెప్పారు. ఈ కేసులో ఆయన కుమార్తె సునీత ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నారని.. ఆమెకు అవసరమైతే.. ప్రభుత్వపరంగా సాయం చేస్తామని చంద్రబాబు తెలిపారు. నేరాలు - రాజకీయాలు ఒకప్పుడు వేరేగా ఉండేవన్నారు.
కానీ, ఒక నేరస్తులు రాష్ట్రంలో రాజకీయాలు చేయడం ప్రారంభించిన తర్వాత.. నేరాలు-రాజకీయాలు కలిసి పోయాయని.. ఇది రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు వెనక్కి తీసుకువెళ్లిపోయిందని చంద్రబాబు చెప్పారు. ఇక, నుంచి వారి ఆటలు సాగనివ్వబోమని.. రాష్ట్రాన్ని శాంతి యుతంగా తీర్చిదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. రాజకీయ నేతలు ఎవరూ నేరస్తులను చేరదీయవద్దని ఆయన సూచించారు. ఇలా చేస్తే..వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.