ఆల్ ఫ్రీ అంటూ బాబు హామీలు వర్షం...!

టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం ఫ్రీ అని బాబు బోల్డ్ గా హామీ ఇచ్చారు

Update: 2023-12-20 17:08 GMT

చంద్రబాబు ఉచిత హామీల వర్షం కురిపించేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగిన యువగళం పాదయాత్ర ముగింపు సభలో బాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఆల్ ఫ్రీ అంటూ చాలానే చెప్పారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే అమలు చేసింది. అది సక్సెస్ ఫుల్ గా సాగడంతో యువగళం సభలో బాబు ఆ హామీని టీడీపీ తరఫున ఇచ్చేశారు.

టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం ఫ్రీ అని బాబు బోల్డ్ గా హామీ ఇచ్చారు. అంతే కాదు పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 రూపాయలు నగదు నేరుగా ఆమె ఖాతాలోనే వేస్తామని మరో హమీఇచ్చారు. ఇక తల్లికి వందనం అన్న హామీ ద్వారా ఏడాదికి పదిహేను వేల రూపాయలు మహిళల ఖాతాలో వేస్తామని అన్నారు.

అదే విధంగా ఏడాదికి మూడు సిలిఎండర్లను ఉచితంగా ఇస్తామని రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్ధిక సాయం చేస్తామని బాబు హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువగతకు నెలకు మూడు వేల రూపాయలు వంతున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు మరో భారీ హామీ ఇచ్చారు.

ఇవన్నీ కొన్ని మాత్రమే అంటూ అసలు హామీలు పూర్తి మ్యానిఫేస్టో త్వరలో విడుదల చేస్తామని అన్నారు.టీడీపీ జనసేన కలసి ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను అమరావతిలో రిలీజ్ చేస్తాయని బాబు ప్రకటించారు. తన రాజకీయ జీవితంలో వైసీపీ లాంటి పార్టీని చూడలేదని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ రాజకీయాలలో ఉండాల్సిన నాయకుడు కాడని అందుకే ఆయన్ని ఓడించి పంపాలని చంద్రబాబు కోరారు. ఒక్కసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మూడు దశాబ్దాల పాటు వెనక్కి వెళ్లేలా చేసిన వైసీపీని తరిమి కొట్టాలని ఆయన ఫైర్ అయ్యారు.

ఏపీ బాగు కావలంటే ప్రజలు తమ కూటమిని ఆదరించాలని బాబు కోరారు. మొత్తం మీద బాబు చాలా హామీలే పోలిపల్లి సభలో ఇచ్చారు. మిగిలినవి అసలైనవి అమరావతిలో జరిగే సభలో విడుదల చేస్తామని అంటున్నారు. బాబు ఇచ్చిన హామీల ప్రభావం ఎంతమేరకు ఉంటుందో రానున్న ఎన్నికల్లో తెలుస్తుంది అంటున్నారు.                                                                    

చంద్రబాబు ప్రకటించిన హామీల్నిచూస్తే..

- ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఉచిత ప్రయాణం

- 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకూ ‘మహాశక్తి’ కార్యక్రమం కింద నెలకు రూ.1500

- చదువుకునే పిల్లలందరికి తల్లికి వందనం పేరుతో ఏడాదికి రూ.15వేలు

- ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం

- వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు

- నెలకురూ.3వేలు నిరుద్యోగ భ్రతి

- యువతను బాగా చదివించే బాధ్యత తీసుకుంటాం. నాలెడ్జ్ ఎకానమీలో వారు ఎదిగేలా చేస్తాం.

- ప్రతి రైతుకు ఏటా రూ.20వేల చొప్పున సాయం

- బీసీల రక్షణకు ప్రత్యేకంగా చట్టం

- ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం

- పేదలను ఆదుకుంటాం. ఎస్సీ.. ఎస్టీల డెవలప్ మెంట్ కోసం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వస్తాం.

ఈ వరాల్నిచూస్తే.. ఇప్పటికే జగన్ ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలకు కాసింత నిధుల్ని అదనంగా ఇవ్వటం కనిపిస్తుంది. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కొన్ని అంశాల్ని చంద్రబాబు ప్రకటించిన వరాల జీబితాలో ఉండటం గమనార్హం. మరి.. చంద్రబాబు హామీలపై ఏపీ ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది తేలాలంటే మరో నాలుగు నెలలు ఆగితే సరిపోతుంది.

Tags:    

Similar News