చంద్రబాబు ముందు మరో సంకటం.. ఏం చేసినా చిక్కే!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే పింఛన్లను ఒకేసారి రూ.1,000 పెంచి రూ.4 వేలు చేశారు. అలాగే ఒకేసారి 100 అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభించారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాల కోసం కేంద్రం భారీ ఎత్తున నిధులు విడుదల చేసేందుకు అంగీకరించింది.
ఈ క్రమంలో చంద్రబాబుకు మరో సంకటం ఎదురుకాబోతోంది. అదే కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కే ఆర్‌బీఎం) ప్రధాన కార్యాలయం ఎక్కడనేదే సమస్యగా మారుతోంది. కృష్ణా నది మహారాష్ట్రలో జన్మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణా నది ప్రవహిస్తున్న దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఈ మధ్య వరకు కేఈఆర్‌ఎంబీ కార్యాలయం హైదరాబాద్ లో ఉంది. దీన్ని గత వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది. దీనిపైన తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే కృష్ణా నది.. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కేఆర్‌ఎంబీ కార్యాలయాన్ని ఈ జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. అలా కాకుండా కృష్ణా నదితో ఏమాత్రం సంబంధం లేని విశాఖపట్నంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏమాత్రం లక్ష్యపెట్టలేదు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కేఆర్‌ఎంబీ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, వాటిలో నీటి నిల్వలు తదితరాలపై ఇంజనీర్లు తరచూ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయవాడ అయితే అన్ని రకాలుగా రాకపోకలకు అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజయవాడలో కేఆర్‌ఎంబీ కార్యాలయ ఏర్పాటుకు నిర్ణయించిందని సమాచారం.
ఇదే నిజమయితే వైసీపీ.. ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశముందని అంటున్నారు. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో కేఆర్‌ఎంబీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయకుండా విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేస్తే చంద్రబాబుపై విమర్శలు తప్పవంటున్నారు.
రాయలసీమకు చెందిన చంద్రబాబు ఆ ప్రాంతానికి ఏమీ చేయడం లేదని.. ఒక వర్గం అధికంగా ఉన్న విజయవాడ వైపే మొగ్గు చూపుతున్నారనే విమర్శలను చంద్రబాబు మోయాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తుది నిర్ణయం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.