చంద్రబాబు విజన్ 2029

చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎం గా మంచి వయసులో ఉన్నపుడు అధికారులను పరుగులు పెట్టించేవారు.

Update: 2024-07-15 04:10 GMT

చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎం గా మంచి వయసులో ఉన్నపుడు అధికారులను పరుగులు పెట్టించేవారు. ఏపీ 2020 నాటికి నంబర్ వన్ కావాలని ఆయన బలంగా కోరుకునేవారు. ఇపుడు చూస్తే ఏడున్నర పదుల వయసులో నాలుగవ సారి అధికారం చేపట్టిన చంద్రబాబు అపుడే 2029 అంటున్నారు.

నిన్న కాక మొన్న ఎన్నికలు జరిగాయి. నిండా అయిదేళ్ళ పదవీ కాలం ఉంది కానీ బాబు మాత్రం అధికారం లోకి వచ్చిన మొదటి రోజు నుంచే వచ్చే ఎన్నికల గురించే తన ఆలోచనలు అన్నీ పెడుతున్నారు. ఈసారి అధికారంలోకి రావడం అద్భుతం అయితే మళ్ళీ ఆ అధికారాన్ని స్థిరపరచుకోవడం అన్నదే బాబు పొలిటికల్ విజన్ గా కనిపిస్తోంది.

ఏపీలో చూస్తే విపక్షంలో ఉన్న వైసీపీ బలహీనంగా ఉన్నా నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది. ఎన్నికల్లో అటు నుంచి ఇటు ఒక పది శాతం కనుక టర్న్ అయితే కచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది బాబు వంటి ఉద్ధండులకు తెలియనిది కాదు. అందుకే వైసీపీని వీక్ చేసే వ్యూహాలకు ఆయన పదును పెడుతున్నారు. ఈ క్రమంలో అవసరం అయితే ఏపీలో కాంగ్రెస్ బలపడినా తప్పులేదని కూడా భావిస్తున్నారు.

కాంగ్రెస్ ఎంతలా బలపడితే అంతలా వైసీపీ వీక్ అవుతుందని ఆ పార్టీ ఓటు బ్యాంక్ బాగా తగ్గిపోతే అదే టీడీపీకి మరోసారి విజయాన్ని తెచ్చిపెడుతుందని బాబు భావిస్తున్నారు. అందుకోసం ఆయన తనదైన శైలిలో తెర వెనక పావులు కదుపుతున్నారు అని అంటున్నారు. ఇలా ఒక వైపు చేస్తూనే మరో వైపు వైసీపీలో అంగబలం అర్ధ బలం కలిగిన నేతలను తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారని అంటున్నారు.

తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఇగోస్ కి పోయి బలమైన నేతలను తానే దూరం చేసుకుంది. వారందరినీ అక్కున చేర్చుకుని టీడీపీ భారీగా రాజకీయ లబ్దిని పొందింది. ఇపుడు వైసీపీ విపక్షంలో ఉంది. బలమైన నాయకులు కావాలి. ప్రతిపక్షంలో అయిదేళ్ళ పాటు పార్టీని నడిపించాలంటే దానికి సంబంధించిన ఆర్ధిక వనరుల కూడా కావాలి.

ఇలా ఖర్చుతో కూడున్న ఈ వ్యవహారంలో వైసీపీకి కీలక నాయకుండ అండ చాలా అవసరం. అలాంటి నేతలను పసుపు శిబిరం వైపుగా నడిపిస్తే వైసీపీకి ఊపిరి ఆడకుండా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఇక పోలవరం అమరావతి ప్రాజెక్టులను రెండింటినీ చంద్రబాబు ఈ టెర్మ్ లో పూర్తి చేసి జనాల ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు. అలాగే వీలైనన్ని పెట్టుబడులను ఏపీకి తీసుకుని రావడం యువతకు ఉపాధిని కల్పించడం వంటివి చేయాలని చూస్తున్నారు. అదే విధంగా అన్ని సామాజిక వర్గాలు టీడీపీని ఈసారి నమ్మాయి. అలాగే ఉద్యోగ నిరుద్యోగ వర్గాలు యువత మహిళ వృద్ధులతో పాటు అంతా కూడా జై కొట్టారు.

అలా వారందరి మద్దతుని పూర్తిగా ఉంచుకోవడానికి బాబు కష్టపడుతున్నారు. ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజల పట్ల అంతా కృతజ్ఞతగా ఉందాలని ఒకటికి పదిసార్లు పార్టీ నేతలకు చెబుతున్నారు. అలాగే మిత్రపక్షం జనసేనతో కూడా పూర్తిగా కలసి వెళ్ళడానికి చూస్తున్నారు. ఎక్కడా పొరపొచ్చాలు లేకుండా సాగాలన్నదే బాబు ఆలోచన.

వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీకి ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా కూటమిగా ముందుకు సాగితే వైసీపీ ఓటమి పాలు అవుతుందన్నదే బాబు మార్క్ వ్యూహంగా ఉంది అని అంటున్నారు. అలాగే అంది వచ్చిన అనేక అవకాశాలను సైతం వాడుకోవడం ద్వారా ఏ చిన్న అవకాశం కూడా వైసీపీ ఇవ్వకూడదని బాబు నిర్ణయించుకున్నారని అంటున్నారు. అందుకే పూర్తిగా మారిన బాబుని అంతా చూస్తున్నారు అని అంటున్నారు.

బాబులో ఈ మార్పుని చూసిన వారు అంతా కూడా టీడీపీ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఇదే రానున్న ఎన్నికల్లో టీడీపీకి పూర్తిగా పాజిటివ్ రేటుని పెంచుతుందని కూడా అంటున్నారు. ఇక బాబు ఏమి చేసినా అధికారంలో ఉన్నాం కదా అని కాకుండా మళ్ళీ అధికారంలోకి రావాలి అని గుర్తు పెట్టుకుని మరీ చేస్తున్నారు. దాంతో బాబు మార్క్ విజన్ చూసిన వారు మరో అయిదేళ్ళకు ఇప్పటి నుంచే వడివడిగా అడుగులు వేస్తున్న బాబుతో పోటీగా ఎవరూ పరుగు పందెంలో సాగలేరని అంటున్నారు.

Tags:    

Similar News