శ్వేత పత్రాలపై చంద్రబాబు ఆరా.. ఏం జరిగింది..!
శ్వేత పత్రాలపై ప్రజలు అసలు చర్చించుకోవడం లేదని.. పథకాల నుంచి తప్పించుకునేందుకు చంద్ర బాబు చెబుతున్న మాటలుగానే భావిస్తున్నారని.. ఒకరిద్దరు కీలక నాయకులు ఉప్పందించారు.
ఇటీవల ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేశారు. ఏకంగా ఏడు ప్రభుత్వ శాఖలపై ఆయన ఈ శ్వేత పత్రాలను ప్రకటించారు. మొత్తంగా 5 రోజుల పాటు సభలు నిర్వహిస్తే.. తొలి రోజు గవర్నర్ ప్రసంగం పోగా.. మిగిలిన నాలుగు రోజులు కూడా.. ఉదయం , సాయంత్రం వైట్ పేపర్ సభలే నడిచాయి. చివరాఖరుకు.. తేల్చింది.. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. జగన్ భ్రష్టుపట్టించారు. కాబట్టి.. ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు చూస్తేనే భయం వేస్తోందని!!
కట్ చేస్తే.. సభలు ముగిసి.. మూడు రోజులు అయ్యాయి. జనాల్లో శ్వేతపత్రాలపై టాక్ ఎలా ఉంది? తాను చెప్పింది నమ్ముతున్నారా? జగన్‌ను తిట్టిపోస్తున్నారా? జగన్ పాలనను అసహ్యించుకుంటున్నారా? అనే విషయాపై పెద్ద ఎత్తున చంద్రబాబు అంతర్మథనం చెందుతున్నారు. అంతేకాదు.. చూచాయగా.. ఈ విషయాన్ని పార్టీ కీలక నాయకుల వద్ద ప్రస్తావించి.. ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని తెలుసు కున్నారు. 'విషయం' తెలిసిపోయింది. దీంతో చంద్రబాబు గేర్ మార్చారు.
శ్వేత పత్రాలపై ప్రజలు అసలు చర్చించుకోవడం లేదని.. పథకాల నుంచి తప్పించుకునేందుకు చంద్ర బాబు చెబుతున్న మాటలుగానే భావిస్తున్నారని.. ఒకరిద్దరు కీలక నాయకులు ఉప్పందించారు. చంద్ర బాబుకు ఉన్న మిత్రులు కూడా.. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. నిజానికి బాబు ఆశించింది... జగన్‌ను తిట్టి.. చంద్రబాబును ప్రజలు మెచ్చుకుంటారనే! కానీ.. ఇది రివర్స్ అయింది. దీంతో ఇప్పుడు క్షేత్రస్థా యిలో రాష్ట్రం ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరువు పెట్టాలని మంత్రులకు హితవు పలికారు.
అంతేకాదు.. ఎక్కడికి వెళ్లినా.. జగన్ చేసిన అరాచకాలు, ఆర్థిక విధ్వంసంపై వివరించాలని అన్నారు. ఆ వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారి ని కలిసి.. ఇదే చెప్పారు. జగన్‌ను తిట్టిపోశారు. ఆయన వల్లే.. పథకాలు అమలు చేయలేకపోతున్నామ న్నారు. అయినా.. వర్కవుట్ కాలేదు. దీంతో వెంటనే శ్వేత పత్రాల విషయాన్ని పక్కకు పెట్టి.. పేదలకు ఇళ్లు పథకాన్నితెరమీదికి తెచ్చారు. వాస్తవానికి ఇది ఇప్పుడు అమలయ్యే పథకం కాదు. వచ్చే ఏడాది నుంచి అమలు చేసే కేంద్ర పథకం. కానీ, ఇప్పుడు హైప్ తీసుకురావడం వెనుక.. శ్వేతపత్రాలపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని అరికట్టడమే కారణంగా కనిపిస్తోంది. మరి దీనిని ప్రజలు ఏమేరకు డైజెస్ట్ చేసుకుంటారో.. చూడాలి.