త్వరగా సరిదిద్దకపోతే.. చంద్రబాబుకు ఇబ్బందేనా?

ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఇసుక విక్రయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Update: 2024-08-22 07:29 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి కారణాల్లో ఒకటిగా నిలిచిన అంశం.. ఇసుక అక్రమ తవ్వకాలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జేపీ వెంచర్స్‌ ముసుగులో వైసీపీ నేతలే ఇసుక అక్రమ తవ్వకాలు సాగించి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఇసుక విక్రయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంకా పూర్తి స్థాయిలో ఇసుక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టకపోయినా ప్రస్తుతానికి మధ్యంతరంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిప్రకారం ఇసుక ఉచితం. ప్రభుత్వానికి ఇసుక విక్రయాల ద్వారా ఎలాంటి లాభం ఉండదు.

ఇసుక ఉచితమే అయినప్పటికీ ఇసుకను లోడ్‌ చేయడానికి కూలీలకు లేదా జేసీబీకి అయ్యే ఖర్చు, రవాణా చార్జీలను వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఇసుక రీచ్‌ లేదా ఇసుక స్టాక్‌ పాయింట్‌ ఆధారంగా దూరాన్ని బట్టి ఇసుక రవాణా వాహనాలకు రవాణా చార్జీలు ఉంటాయి.

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మధ్యంతరంగా తెచ్చిన ఉచిత ఇసుక విధానంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓవైపు ఇసుక ఉచితమంటూ ఒక్కో టిప్పర్, లారీకి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

వైసీపీ నేతల విమర్శలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. ఇసుక ఉచితమేనని.. అయితే ఇసుకను వాహనాల్లో లోడ్‌ చేయడానికి, ఇసుకను వినియోగదారుల ఇళ్ల వద్ద లేదా వారు కోరుకున్నచోటకు తరలించడానికి రవాణా చార్జీలను వారే భరించాల్సి ఉంటుందని స్పష్టత ఇస్తున్నారు. తాము తెచ్చిన ఉచిత ఇసుక విధానం బ్రహ్మాండంగా విజయవంతమైందని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు.

అయితే క్షేత్ర స్థాయి పరిస్థితి వేరుగా ఉందని అంటున్నారు. తక్కువ మొత్తానికి కూటమి నేతలు ఇసుకను తెచ్చుకుని.. దాన్ని భారీ ఎత్తున ఒక చోట నిల్వ చేసుకుని పెద్ద మొత్తాలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉచిత ఇసుక విధానంలో పారదర్శకత లేదని.. రీచ్‌ ల్లో కూటమి నేతల పెత్తనమే నడుస్తోందనే విమర్శలు రేగుతున్నాయి. కూటమి నేతలు స్లిప్పులపైన అమౌంట్‌ వేసి వసూళ్లు చేస్తున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో వీలయిన ంత త్వరగా ఇసుక విధానంపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా ఇసుక విధానంపై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ఆన్‌ లైన్‌ లో బుక్‌ చేసుకున్న వాహనాలే రీచ్‌ కు లేదా స్టాక్‌ పాయింట్‌ కు రావాలన్నారు. ఇసుక రీచ్‌ ల వద్ద పెద్ద ఎత్తున లారీలు, టిప్పర్లు నిలిచి ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. టిప్పలు, లారీలు ఎందుకు ఉంటున్నాయని అధికారులను ఆరా తీశారు.

ప్రస్తుతం ఇసుక బుకింగ్‌ ఆన్‌లైన్‌ విధానంలో ఉండగా ఆఫ్‌ లైన్‌ లోనూ ప్రవేశపెడతామని చంద్రబాబు తెలిపారు. ఇసుక రీచ్‌ లు, ఇసుక స్టాక్‌ పాయింట్లకు సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇసుక కోసం ఆఫ్‌ లైన్‌ బుకింగ్‌ ప్రవేశపెడతామని చెప్పారు.

ఏదేమైనా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఇసుక విధానంలో చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏమాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వస్తుందని.. ప్రభుత్వానికి చెడ్డపేరు తప్పకపోవచ్చని అంటున్నారు.

Tags:    

Similar News