అమరావతి కోసం ప్రత్యేక చట్టం ...బాబు ఆలోచన !?
మెంటల్ ఫేలోస్ కే అలాంటి ఆలోచనలు వస్తాయని ఇండైరెక్ట్ గా జగన్ ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
అమరావతి రాజధాని విధ్వంసం ఒక కేసు స్టడీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఒక రాజధానిని నిర్ణయించుకుని నిర్మాణం పనులు ప్రారంభించాక దానికి మళ్ళీ మార్చడం అన్నది ఇంతవరకూ ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదని చంద్రబాబు అన్నారు.
మెంటల్ ఫేలోస్ కే అలాంటి ఆలోచనలు వస్తాయని ఇండైరెక్ట్ గా జగన్ ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి లాంటి రాజధానిని కదపడం అన్నది తొలిసారిగా జరిగిందని అన్నారు. భవిష్యత్తులో తిక్క గాళ్ళు ఎవరైనా రాజధానిని కదపడానికి చూస్తారని అందువల్ల ఎవరూ అలాంటి పని చేయకుండా దేశంలోనే రాజధానుల కోసం ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
కేవలం ఏపీకి మాత్రమే కాదు దేశంలోనే అమరావతి రాజధానిని చూసి న్యాయపరంగా ఏమి చేయాలన్నది ఆలోచించాల్సి ఉందని ఆయన అన్నారు. అమరావతి రాజధాని విషయం అందరికీ ఒక గుణపాఠం గా మారిందని అన్నారు. అమరావతి రాజధాని శాశ్వతంగా అక్కడే ఉండేలా ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తామని చంద్రబాబు చెప్పారు.
అమరావతిని ఎన్ని తరాలు గడచినా ఎక్కడికీ తరలించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అవన్నీ తాము చేస్తామని అన్నారు. అమరావతి రాజధాని విధ్వంసం చేసిన జగన్ లాంటి వారు సీఎం పోస్టుకు అర్హులు అవునా కాదా అని ప్రజలు ఆలోచించాల్సి ఉంది. అంతే కాదు రాజకీయాలకు ఆయన అర్హుడేనా అని బాబు ప్రశ్నించారు.
అమరావతి పేరిట జగన్ ప్రభుత్వం చేసిన నష్టం అంతా ఇంతా కాదని బాబు అన్నారు. అమరావతి విషయంలో ఎందుకు అంత పగ అని ఆయన ప్రశ్నించారు. అయిదు కోట్ల మందికి రాజధాని లేకుండా చేసి జగన్ వారి జీవితాలతో చెలగాటం ఆడారని అన్నారు. ఆయన ఒక శాపంగా మారారని కూడా విమర్శించారు.
అమరావతి రాజధాని ప్రపంచ నగరం అని సంపదను సృష్టించే కల్పతల్లి అని బాబు అన్నారు. పెట్టుబడులు పెట్టేవారు కూడా అమరావతిలో జరిగిన విధ్వంసం చూసి రాకుండా పోయారని, రేపు మళ్లీ వారు వద్దాం అనుకున్నా ఏపీలో ఒక భూతం ఉందని భావించి భయపడే పరిస్థితి ఉంటుందని బాబు అన్నారు. అమరావతిని తాను బ్రహ్మాండమైన రాజధానిగా నిర్మించాలని అనుకున్నానని అన్నారు.
అయిదేళ్ల విలువైన కాలం వృధా అయిపోయింది అని ఆయన అన్నారు. 2004లో తాను మళ్లీ గెలిచి ఉంటే హైదరాబాద్ నగరం అభివృద్ధి వేరే లెవెల్ లో ఉండేదని ఆయన అన్నారు. అభివృద్ధి సాగాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలని ఆయన అన్నారు. కానీ తాను మూడు సార్లు ఓటమి పాలు కావడంతో జరగాల్సిన అభివృద్ధి ఆగిపోయింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తం మీద చంద్రబాబు మాటలు చూస్తూంటే ఫ్యూచర్ లో ఎంతటి వారు అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధాని అడుగు కూడా కదల్చలేకుండా న్యాయపరమైన కట్టుదిట్టాలు చేసేలా ఉందని అంటున్నారు.అవసరం అయితే ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకుని వస్తారని అంటున్నారు.