స్పీకర్ కోసం పట్టుబడుతున్న టీడీపీ...రీజన్ అదే ?

తెలుగుదేశం పార్టీకి ఢిల్లీలో ఎంతో ప్రాముఖ్యత పెరిగింది. ఆ పార్టీ లేకపోతే ఎన్డీయే మూడవసారి అధికారంలోకి వచ్చే సీన్ లేదు

Update: 2024-06-06 14:06 GMT

తెలుగుదేశం పార్టీకి ఢిల్లీలో ఎంతో ప్రాముఖ్యత పెరిగింది. ఆ పార్టీ లేకపోతే ఎన్డీయే మూడవసారి అధికారంలోకి వచ్చే సీన్ లేదు. అలా తులసీదళం లా టీడీపీ ఎంపీల బరువు ఎన్డీయే పరువుని కాపాడుతోంది. దాంతో చంద్రబాబు ఏమి కోరుకున్నా ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సిద్ధంగా ఉంది అని ఢిల్లీ వార్తలు చెబుతున్నాయి.

చంద్రబాబు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడంలో తన అనుభవాన్ని అంతా రంగరిస్తున్నారు. ఈసారి ఎన్డీయే ప్రభుత్వంలో ఏపీ నుంచి భారీ రాజకీయ వాటా ఉండబోతోంది అన్నది సుస్పష్టం. కేంద్ర ప్రభుత్వంలో 81 మంది మంత్రులకు చోటు ఉంటుంది. మొత్తం 543 మంది లోక్ సభ ఎంపీలలో పదిహేను శాతం మందిని మాత్రమే కేంద్ర మంత్రి మండలిలో తీసుకోవాలి.

దాంతో ఆ లెక్క 81 వద్ద ఉంటుంది. 2014, 2019లలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా మెజారిటీలను సాధించింది. అయినా బీజేపీ ఎన్డీయే మిత్రులకు పదవులు ఇచ్చింది. అయితే అవన్నీ పది నుంచి పన్నెండు లోపు మాత్రమే. మిగిలిన 70 మంత్రి పదవులూ కేంద్రంలోని బీజేపీ నేతలు అందుకున్నారు

ఈసారి అలా కాదు పదవుల్లో కనీసంగా ఇరవై నుంచి ముప్పయి శాతం షేర్ మిత్రులకు ఇవ్వాల్సి ఉంటుంది. బీజేపీ తరువాత పెద్ద పార్టీగా టీడీపీ ఉంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. అలాగే బీహార్ లోని నితీష్ నాయకత్వంలోని జేడీయూకు 12 మంది ఎంపీలు ఉన్నారు. దాంతో ఈ రెండు పార్టీలకు పెద్ద ఎత్తున మంత్రి పదవులు ఇస్తే తప్ప ఎన్డీయేకి స్థిరత్వం రాదు.

దాంతో చంద్రబాబు నితీష్ కుమార్ బీజేపీ అగ్ర నేతల వద్ద తమ డిమాండ్లు బాగానే పెడుతున్నారు. ముందుగా చంద్రబాబుని తీసుకుంటే ప్రత్యేక హోదా ఏపీకి ఇచ్చి తీరాల్సిందే అని అంటున్నారు. ఈ డిమాండ్ కి ఒప్పుకుంటేనే కేంద్ర మంత్రి వర్గంలో చేరుతామని కూడా కండిషన్ ఆయన పెడుతున్నట్లుగా తెలుస్తోంది.

మరో వైపు చూస్తే కనీసంగా ఆరు కేంద్ర మంత్రిత్వ శాఖలు తమకు కేటాయించాలని బాబు కోరుతున్నారని తెలుస్తోంది. ఆ శాఖలలో నాలుగు క్యాబినెట్ ర్యాంకువి అయితే రెండు సహాయ మంత్రి పదవులు అని అంటున్నారు. క్యాబినెట్ ర్యాంక్ పదవులలో గ్రామీణాభివృద్ధి శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జల వనరుల శాఖ, ఉపరితల రవాణా శాఖలను టీడీపీ కోరుతోంది అని అంటున్నారు.

అలాగే రెండు సహాయ మంత్రులలో ఆర్ధిక శాఖ, అలాగే మరో కీలకమైన శాఖ కోరుతున్నారని భోగట్టా. ఇక వీటితో పాటుగా అత్యంత కీలకమైన స్పీకర్ పదవిని టీడీపీకే ఇవ్వాలని ఆ పార్టీ గట్టిగా పట్టుబడుతోంది. ఎందుకు ఇలా అంటే బీజేపీ బిగ్ షాట్స్ వ్యూహాలూ ఎత్తుగడలూ తెలిసే అని అంటున్నారు.

బీజేపీకి లోక్ సభలో 240 మంది మాత్రమే ఎంపీలు ఉన్నారు. ఈ రోజున అధికారానికి మిత్రుల సాయంతో వచ్చినా ఎల్లకాలమూ అలాగే ఉండాలని బీజేపీ కోరుకోదు. సమయం సందర్భం చూసి ఫిరాయింపులకు ప్రోత్సహించే చాన్స్ ఉంది. అదే జరిగితే స్పీకర్ అత్యంత కీలకం అవుతారు.

అందువల్ల ముందస్తు వ్యూహంతో ఈ తరహా ప్లాన్స్ ఏమైనా ఉంటే వాటికి చెక్ పెట్టడానికే బాబు స్పీకర్ పోస్ట్ ని కోరుతున్నారు అని అంటున్నారు. స్పీకర్ కనుక టీడీపీ మనిషి అయితే పదహారు మంది ఎంపీలు సేఫ్ గా ఉంటారు అని అంటున్నారు. అలాగే ఫ్యూచర్ లో టీడీపీకి కూడా ఎన్డీయే ప్రభుత్వంలో పట్టు దొరుకుతుంది అని అంటున్నారు గతంలో స్పీకర్ పదవిని వాజ్ పేయ్ టీడీపీకి ఇచ్చిన సంగతిని కూడా గుర్తు చేసి మరీ ఈసారి అడుగుతున్నారు. మరి దీనికి బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియడంలేదు.

ఢిల్లీ వార్తలను బట్టి చూస్తే బీజేపీ రెండు క్యాబినేట్ రెండు సహాయ మంత్రి పదవులు టీడీపీకి ఇవ్వడానికి సుముఖంగా ఉందని అంటున్నారు. ఆరోగ్య శాఖతో పాటు రూరల్ డెవలప్మెంట్ శాఖకు ఇచ్చేందుకు బీజేపీ ఓకే అంటున్నారు. స్పీకర్ పదవి విషయంలో మాత్రం బీజేపీ నో చెప్పే అవకాశాలే ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే చేతిలో స్పీకర్ ఉండాలని వారు గట్టిగా కోరుకుంటున్నారుట.

Tags:    

Similar News