టీడీపీ ప్రభుత్వ సలహాదారులు వీరేనా?
అలాగే డీజీపీగా ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయం సాధించాక కూటమి ప్రభుత్వం కీలక అధికారుల బదిలీలు, నియామకాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఒకే రోజు 21 మంది కీలక అధికారులను బదిలీలు చేసింది. వీరిలో ఒక్క తిరుపతి కలెక్టర్ మినహా మిగిలినవారంతా ప్రభుత్వంలో వివిధ శాఖలకు ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్ హోదాల్లో ఉన్నవారే. అలాగే డీజీపీగా ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికల కోడ్ వచ్చాక నియమితులయిన నీరబ్ కుమార్ ప్రసాద్ ను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించే యోచనలో ఉంది. ఆయన జూన్ 30తో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే మరో ఆరు నెలలు ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాశారు.
మరోవైపు గతంలో కీలక విభాగాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన సమర్థులైనవారిని సలహాదారులుగా నియమించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మొదటగా వెంకటేశ్వరరావును జలవనరుల శాఖ సలహాదారుగా నియమించారు. ఆయన గతంలో పోలవరం చీఫ్ ఇంజనీర్ గానూ, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గానూ పనిచేశారు. ఆయనకు సాగునీటి ప్రాజెక్టులపై అపార అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను సలహాదారుగా నియమించారు. రెండేళ్లపాటు వెంకటేశ్వరరావు పదవిలో ఉంటారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
అలాగే మరికొంతమంది అనుభవజ్ఞులు, సమర్థులను కూడా సలహాదారులుగా నియమించుకోవడంపై చంద్రబాబు దృష్టి సారించారని సమాచారం. ఇందులో భాగంగా అదనపు డీజీ హోదాలో పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావును సలహాదారుగా నియమిస్తారని తెలుస్తోంది. ఈయన గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిఘా విభాగాధిపతిగా పనిచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏబీ వెంకటేశ్వరరావును బాగా ఇబ్బందిపెట్టిందనే ఆరోపణలున్నాయి. ఆయనను పదవి నుంచి సస్పెండ్ చేయడంతోపాటు పలు కేసులను కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు న్యాయం చేయాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది.
అలాగే ఆర్థిక శాఖ, ప్రణాళిక విభాగాల్లో పనిచేసిన టక్కర్, అవినీతి నిరోధక విభాగంలో పనిచేసిన ఆర్పీ ఠాకూర్ లను కూడా సలహాదారులుగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. వీరు నిజాయితీపరులుగా, సమర్థులుగా పేరుపొందారు. అలాగే గతంలో పెట్టుబడుల ప్రోత్సాహక మండలి చైర్మన్ గా పనిచేసిన జాస్తి కృష్ణకిశోర్ ను కూడా ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తారని టాక్ నడుస్తోంది. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడనున్నాయని అంటున్నారు.
ఈ క్రమంలో సలహాదారుల నియామకాల విషయంలో చంద్రబాబు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. నిజాయితీపరులు, సమర్థులుగా పేరున్న సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ విశ్రాంత అధికారులనే సలహాదారుల పదవులకు పరిశీలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అనుభవం, అర్హతలు లేకపోయినా వందల సంఖ్యలో సలహాదారులను నియమించారనే ఆరోపణల నేపథ్యంలో అలాంటివి తలెత్తకుండా బాబు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం.