సీజేఐ నోట షాకింగ్ మాట.. అందుకే మార్నింగ్ వాక్ ఆపేశా

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తాజాగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

Update: 2024-10-25 10:30 GMT

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తాజాగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి 4.15గంటల వేళలో తనకు మార్నింగ్ వాక్ చేసే అలవాటు ఉందన్న ఆయన.. ఈ మధ్యనే తానీ అలవాటుకు చెక్ చెప్పినట్లుగా చెప్పారు. ఇటీవల వైద్యులు తనకు చేసిన హెచ్చరిక కారణంగా మార్నింగ్ వాక్ నిలిపేసినట్లుగా చెప్పారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇంటికే పరిమితం కావాలని.. పొద్దుపొద్దున్నే ఢిల్లీలో మార్నింగ్ వాక్ ఏ మాత్రం మంచిది కాదని చెప్పారని.. అందుకే తానీ రోజు నుంచే మార్నింగ్ వాక్ కు మంగళం పలికినట్లుగా పేర్కొన్నారు.

దేశ రాజధానిలో పెరిగిన వాయుకాలుష్యం ఎంత ఎక్కువన్న విషయాన్ని చీఫ్ జస్టిస్ తన మాటలతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టులో వార్తల్ని కవర్ చేసే జర్నలిస్టులకు సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో వార్తల్ని సేకరించేందుకు అధికారిక అక్రిడేషన్ అవసరం. ఇది కావాలన్న వారు తప్పనిసరిగా లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అయితే.. ఈ నిబంధనపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన.. సుప్రీంకోర్టు వార్తల్ని కవర్ చేసే రిపోర్టర్లకు లా డిగ్రీ ఉండాలన్న నిబంధన ఎందుకు పెట్టారో తనకు అర్థం కాలేదన్నారు.

అందుకే.. ఆయన ఆ రూల్ ను ఎత్తేస్తూ తాజాగా సంతకం చేశారు. దీంతో..సుప్రీంకోర్టులో వార్తల్ని కవర్ చేసేందుకు లా డిగ్రీ అవసరం లేకుండా పోయింది. ఈ నిర్ణయంతో మరింత మంది జర్నలిస్టులు సుప్రీంకోర్టు అక్రిడేషన్ ను పొందే వీలు కలగనుంది. నవంబరు 10న సీజేఐగా పదవీ విరమణ చేయనున్న ఆయన.. తన హయాంలో పలు సంస్కరణల్ని తీసుకురావటం తెలిసిందే. ప్రత్యక్ష విచారణతో పాటు ఆన్ లైన్ విచారణను కూడా తీసుకురావటం తెలిసిందే.

Tags:    

Similar News