మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఏపీ మీద ఎంతవరకూ ప్రభావం చూపిస్తాయి అన్న దాని మీద అంతా చర్చించుకుంటున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఓటమి పాలు కావడంతో ఏపీలో వైసీపీ సేఫ్ జోన్ లోకి వెళ్ళింది అని అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ బలపడితే దాని ప్రభావం వైసీపీ మీదనే గట్టిగా ఉండేది అని అంతా విశ్లేషించారు
ఇక ఎండీయే కూటమి మహారాష్ట్ర ఎన్నికల్లో గెల్వడంతో ఏపీలో టీడీపీ కూటమికి కొత్త బలం వచ్చింది. మరింత కాలం ప్రజాదరణతో తాము హాయిగా ఉండొచ్చు అన్న భావన ఒక రకమైన భరోసా వారిలో కనిపిస్తోంది. ఇపుడు చూస్తే కనుక కాంగ్రెస్ ఓటమి ప్రభావం ఏపీ కాంగ్రెస్ మీద పడుతోంది అని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ గత పదేళ్ళుగా ఏ మాత్రం ఎత్తిగిల్లలేదు. వైఎస్సార్ బ్లడ్ అని షర్మిలను తెచ్చారు. ఆమె ఈ ఏడాది జనవరిలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారు.
షర్మిల వస్తే ఏపీ కాంగ్రెస్ ఎంతో కొంత ముందుకు అడుగులు వేస్తుంది అనుకున్న వారికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయి. కాంగ్రెస్ కి ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. షర్మిల వైసీపీ మీద చేసిన ప్రచారం కానీ జగన్ మీద విరుచుకుపడిన తీరు కానీ టీడీపీ కూటమికి బాగా ప్లస్ అయింది.
దాంతో పాటుగా కాంగ్రెస్ ఓటు షేర్ ఏ మాత్రం అయినా పెరుగుతుందేమో అనుకున్నా ఆ ఆశ కూడా తీరలేదు. దీంతో కాంగ్రెస్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అని అంటున్నారు. ఇక ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.
ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాల్సిన కాంగ్రెస్ నాయకురాలు షర్మిల మాత్రం జగన్ మీదనే విమర్శలు చేస్తున్నారు. ఆమె సొంత అజెండాను బయటకు తీస్తున్నారు అని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు.
ఏపీలో కాంగ్రెస్ ని లేపే దిశగా ఏ మాత్రం అడుగులు పడడం లేదని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ తాను పదేళ్ళ క్రితం పోగొట్టుకున్న ఓటు బ్యాంక్ ని తిరిగి వెనక్కి తెచ్చుకోవాల్సి ఉంది. అలగే గ్రౌండ్ లెవెల్ లో ఉన్న పార్టీ నేతలను పార్టీలోకి తెచ్చి బలోపేతం చేసుకోవాల్సి ఉంది. దానికి తగిన కార్యాచరణను రూపొందించాల్సి ఉంది. సీనియర్ నేతలను కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన నేపథ్యంలో షర్మిల మాత్రం తనదైన తీరులో ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు.
ఇక ఏపీలో టీడీపీ కూటమి అధికారం అంది పుచ్చుకుని ఆరు నెలల కాలం అవుతోంది. కాంగ్రెస్ ప్రజల వద్దకు ఎలా వెళ్లాలి ఏ విధంగా అజెండాను తీసుకోవాలి అన్న దాని మీద ఒక నిర్ణయానికి రాలేకపోతోంది అని సీనియర్ నేత రఘువీరారెడ్డి వంటి వారు అంటున్నారు అంటే అర్థం చేసుకోవాల్సిందే మరి.
మహారాష్ట్రలో పరిస్థితులను చూసి అయినా ఏపీ కాంగ్రెస్ లో మార్పులు చేయాలని రఘువీరా వంటి వారు అంటున్నారు. కాంగ్రెస్ ని జనంలో ఉడేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి కాంగ్రెస్ సీనియర్ల మనోగతం ఏమిటి వారు మార్పు కోరుతున్నారు అంటే షర్మిలలో మార్పునా లేక ఏకంగా పీసీసీ చీఫ్ మార్పునా అన్నది కూడా చూడాల్సి ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీ కాంగ్రెస్ లో మార్పులు చేయాలన్న డిమాండ్ అయితే గట్టిగానే వస్తోంది. కాంగ్రెస్ పెద్దలు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.