డిప్యూటీ సీఎం కి చేగొండి గొళ్ళెం !
ముఖ్యంగా కాపు సామాజిక వర్గ సమస్యల మీద ఆయన పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగానే పోరాడుతూనే ఉన్నారు.
మాజీ మంత్రి సీనియర్ నేత కాపు నాయకుడు చేగొండి హరిరామజోగయ్య స్టైలే వేరు. దాదాపుగా తొంబై ఏళ్ళకు చేరువ అవుతున్నా ఈ వృద్ధ నేత రాజకీయంగా మాత్రం ఇంకా చురుకే అంటున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ సమస్యల మీద ఆయన పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగానే పోరాడుతూనే ఉన్నారు.
జనసేనకు ఒకనాడు పెద్ద దిక్కుగా ఉంటూ పవన్ కళ్యాణ్ కి శ్రేయోభిలాషిగా ఉన్న చేగొండి ఆ తరువాత సీట్ల విషయంలో పొత్తుల విషయంలో పెట్టిన డిమాండ్లు పవన్ ని తీవ్రంగా ఇరకాటంలో పెట్టాయి. పవన్ తనదైన వ్యూహంతోనే ముందుకు సాగి ఈ రోజున ఉప ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు.
అయితే చేగొండి ఉప ముఖ్యమంత్రికి సైతం అర్జీలు పంపిస్తూ డిమాండ్లు వినిపిస్తూ ఎన్నికల అనంతర రాజకీయాన్ని స్టార్ట్ చేశారు. తాజాగా ఆయన పవన్ కి రాసిన లేఖ చూస్తే చేగొండి మళ్లీ గొళ్ళెం బిగిస్తున్నారా అన్న డౌట్లు రాక మానదు.
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఆయన పవన్ కి తాజా లేఖలో కోరారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయండి అని ఆయన పెద్ద డిమాండే పెట్టారు. దేశవ్యాప్తంగా ఈ డబ్ల్యూ ఎస్ కింద ఆర్ధికంగా పేదవారి కోసం కేంద్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. అందులో అయిదు శాతం కాపులకు గత టీడీపీ ప్రభుత్వం కేటాయించింది.
ఇపుడు దానిని అమలు చేయమని చేగొండి గట్టిగా కోరుతున్నారు. ఇది అమలు చేసే విషయంలో సాధ్యాసాధ్యాలు చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆర్ధికంగా పేదలు అయిన బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, వెలమ, కమ్మ, రెడ్డి ఓసీ కాపులు అంతా ఈ రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్నారు. అందరికీ ఇపుడు సమాన వాటా ఉంది.
ఇందులో నుంచి అయిదు శాతం కాపులకు కేటాయిస్తే కేవలం ఆ మిగిలిన అయిదు శాతంతో అన్ని ఓసీ కులాలు సర్దుకోవాల్సి ఉంటుంది. తాజా ఎన్నికల్లో అగ్ర కులాలు అన్నీ గుత్తమొత్తంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. దాంతో ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. దాంతో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తే మిగిలిన వారు దూరం అవుతారన్న ఆందోళన ఉంది.
ఈ నేపధ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక కులపరమైన రిజర్వేషన్ల జోలికి కూటమి ప్రభుత్వం ఇప్పట్లో పో దలచుకోలేదు అన్న మాట వినిపిస్తోంది. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలోనిది. ఒకసారి దానిలో జోక్యం చేసుకుని కొరివితో తల గోక్కున్న నేపధ్యం టీడీపీ ప్రభుత్వానికి ఉంది. అందువల్ల టీడీపీ ఈ విషయంలో ఎన్నికల్లో సైతం హామీ ఇవ్వలేదు.
పవన్ విషయం తీసుకున్నా ఆయన కులాలకు అతీతంగానే ముందుకు సాగాలని చూస్తున్నారు. అందరి వాడుగా ఉండాలని అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో గతంలో ముద్రగడ అయితే కాపులను బీసీలలో చేర్చే విషయం చూడమని ఒక డిమాండ్ పెట్టారు. ఇపుడు చేగొండి కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అంటున్నారు. ఇలా కాపు పెద్దలు ఇద్దరూ పవన్ మీద చెరో విధంగా ఒత్తిడి తెస్తున్నారు.
అయితే పవన్ తనదైన విజన్ తో పనిచేస్తారని అంటున్నారు. ఆయన రాజకీయంగా రాటు దేలారని తాను చేయాలన్న దాని మీద పూర్తి స్పష్టతతో ఉన్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ పాలనలో ఏపీలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టిస్తారని ఆశిస్తామని కూడా చేగొండి కోరుకున్నారు.
అదే విధంగా క్రిష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని గ్రామ మండల జిల్లా స్థాయి పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు సినిమాలకు రాజకీయలకు సమానంగా సమయం కేటాయించాలని కూడా చేగొండి కోరుకున్నారు. మొత్తానికి మరోసారి జనసేనకు తాను మార్గదర్శకుడిగా ఉండాలని చేగొండి ఆశిస్తున్నారులా ఉంది. మరి ఈ లేఖ మీద పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. పవన్ ఇపుడు కీలకమైన బాధ్యతలలో ఫుల్ బిజీగా ఉన్నారు.