యజమాని ఉదారత.. పనివాళ్లకు సర్ ప్రైజ్ గిఫ్ట్!
ఏ కంపెనీ అయినా, యజమాని అయినా తమ దగ్గర పనిచేసేవాళ్లను ఉద్యోగులు, పనివాళ్లగానే చూస్తారు
ఏ కంపెనీ అయినా, యజమాని అయినా తమ దగ్గర పనిచేసేవాళ్లను ఉద్యోగులు, పనివాళ్లగానే చూస్తారు. వారి పనికి తగ్గ కూలి/జీతం ఇచ్చాం అన్నట్టే ఉంటారు. అంతకుమించి తమ దగ్గర పనిచేసేవాళ్లకు ఏమైనా చేయాలంటే పెద్ద మనసు ఉండాల్సిందే. ఇలాంటి మంచి యజమాని విషయమే ఇది..
తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న సొక్కనూరుకు చెందిన మాయన్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన వివిధ నిర్మాణాల పనులు చేస్తుంటారు. ఆయన వద్ద పెద్ద సంఖ్యలో నిర్మాణ పనులు చేసే సిబ్బంది ఉన్నారు.
కాగా మాయన్ తమిళ అగ్ర నటుడు, ఇటీవల మరణించిన కెప్టెన్ విజయకాంత్ కు పెద్ద అభిమాని. విజయ్‌కాంత్ మార్గంలోనే తన వద్ద పనిచేసే వారిని ప్రోత్సహించడానికి ఏటా ప్రత్యేక బహుమతులు ఇస్తుంటాడు. అంతేకాకుండా హాలిడే ట్రిప్ లకు కూడా తీసుకెళ్తుంటాడు.
ఈ నేపథ్యంలో చెన్నై నగరంలో తన అభిమాన నటుడు విజయకాంత్ స్మారక స్థూపాన్ని నిర్మించేందుకు తన వద్ద పనిచేసే 35 మంది మహిళలు, 40 మంది పురుషులను ఆయన మదురై నుంచి చెన్నైకి తీసుకెళ్లారు. అయితే ఇందులో వింత ఏముందని అనుకుంటున్నారా?
మొత్తం 75 మంది పనివాళ్లను మాయన్.. తన సొంత ఖర్చులతో మధురై నుంచి చెన్నైకు విమానంలో తీసుకెళ్లారు. దీంతో వారి సంబరం మామూలుగా లేదు. వారంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
ఈ సందర్భంగా మాయన్ మాట్లాడుతూ తనకు 2002లో మొదటిసారిగా విమానంలో ప్రయాణించే అవకాశం దక్కిందన్నారు. అప్పుడు తాను చాలా సంతోషించానని తెలిపారు. ఈ అనుభూతి తన వద్ద పనిచేసే వారికి కూడా దక్కాలనుకున్నానని వెల్లడించారు. అందుకే 75 మందిని విమానంలో చెన్నై తీసుకెళ్లినట్లు తెలిపారు. అంతేకాకుండా వారిని మెరీనా బీచ్, మహాబలిపురం తదితర పర్యాటక ప్రాంతాలకు కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
గతంలో గుజరాత్ లోని సూరత్ లోని ఒక వ్యాపారి తన కంపెనీ ఉద్యోగులందరికీ ఇళ్లు కట్టించి ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మరొక వ్యాపారి తన వద్ద పనిచేసే ఉద్యోగులందరికీ కార్లు బహూకరించాడు. ఇప్పుడు ఇదే కోవలో మాయన్ కూడా తన దగ్గర పనిచేసే వాళ్లకు విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించాడు.