చెవిరెడ్డి అరెస్టు? క్వాష్ పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు
ఇప్పుడు చెవిరెడ్డి పిటిషనును హైకోర్టు కొట్టి వేయడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించవచ్చని అంటున్నారు.
ఏపీ హైకోర్టులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని వేసిన పిటిషనును హైకోర్టు కొట్టివేసింది. దీంతో చెవిరెడ్డి అరెస్టుకు పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది. మరోవైపు హైకోర్టు తీర్పుపై చెవిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిందని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డితోపాటు ఆయన అనుచరులు, వైసీపీ నాయకులు ఆరోపించారు. దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో చెవిరెడ్డిపై బాలలపై లైంగిక నేరాల నిరోధం (పోక్సో)తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న గొంతు అణచివేసేందుకే ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేసిందని, ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషనును విచారించిన హైకోర్టు చెవిరెడ్డికి షాకిస్తూ ఆయన పిటిషనును డిస్మిస్ చేస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది.
బాలికపై అత్యాచారం జరిగిందని చెవిరెడ్డితోపాటు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ కూడా బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. అయితే బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు మాత్రం అత్యాచారం జరగలేదని చెబుతున్నారు. వైద్య నివేదికలను చూపుతున్నా, బాలికపై అసత్య ప్రచారం చేశారని చెవిరెడ్డి ప్రభుతులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పుడు చెవిరెడ్డి పిటిషనును హైకోర్టు కొట్టి వేయడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించవచ్చని అంటున్నారు. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచనలో ఉన్న చెవిరెడ్డి తన న్యాయవాదులతో సంప్రదిస్తున్నారు. తిరుమల దర్శనం టికెట్ల కోసం తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించిన నేపథ్యంలో ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి రాజకీయం నడుస్తోంది. ఇలాంటి సమయంలో చెవిరెడ్డి అరెస్టుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే వాతావరణం మరింత వేడెక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు.