24 రోజుల లాంగ్ గ్యాప్ తర్వాత దర్శనమిచ్చిన సీఎం కేసీఆర్

అయితే.. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే కన్నా.. ఎప్పుడో సారి ఇవ్వటాన్ని పలువురు తప్పు పట్టారు

Update: 2023-10-13 06:02 GMT

కారణం ఏమైనా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వారాలు. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే 24 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉన్నారు? అనారోగ్యం తర్వాత ఆయన ఎంతలా రికవరీ అయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సామాన్యులకు లభించేలా ఆయన ఫోటోలు బయటకు వచ్చాయి. కొన్ని రోజల పాటు వైరల్ ఫీవర్ తో పాటు.. కొన్ని ఆరోగ్య సమస్యలు రావటం. వీటిపై మంత్రి కేటీఆర్ స్వయంగా ట్వీట్ చేయటం తెలిసిందే.

అయితే.. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే కన్నా.. ఎప్పుడో సారి ఇవ్వటాన్ని పలువురు తప్పు పట్టారు. ఆయన ఆరోగ్యం కుదుట పడిందన్న మాటే తప్పించి.. ఆయనకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. ఇలాంటి వేళ తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు ముఖ్యులు.. కేసీఆర్ ఆరోగ్యంపై సందేహాల్ని వ్యక్తం చేయటంతో పాటు.. బయట ప్రపంచానికి కేసీఆర్ ఎలా ఉన్నారో చూపించాలన్న డిమాండ్ చేశారు.,

అయితే.. ఈ డిమాండ్ ప్రజల్లోకి పెద్దగా వెళ్లింది లేదు. ఈ నెల 15న తాను ప్రకటించిన పార్టీ అభ్యర్థులకు బీ పారాలు ఇవ్వటంతో పాటు.. ఎన్నికల హామీ పత్రాల్ని విడుదల చేయటంతో పాటు.. ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా షురూ చేస్తారని ప్రకటించారు. దీంతో.. ఎన్నికల హామీలు ఏ రీతిలో ఉంటాయన్న ఆసక్తి వ్యక్తమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మూడు వారాలు పూర్తి అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉన్నారు? ఆయనకు సంబంధించిన ఫోటో కానీ బయటకు రాని పరిస్థితి.

ఇలాంటివేళ.. లాంగ్ గ్యాప్ తర్వాత కేసీఆర్ తాజా ఫోటో బయటకు వచ్చింది.మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతిభవన్ కు వెళ్లారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చేపట్టిన డెవలప్ మెంట్ కార్యక్రమాలకు సంబంధించిన సమగ్ర వివరాలతో.. పాలమూరు ప్రగతి నివేదిక పేరుతో ఒక పుస్తకాన్ని సిద్ధం చేయించారు. దాన్ని ముఖ్యమంత్రికి అందించి.. ఆయనతో కలిసి తాను ఫోటో దిగారు. వీటిని తాజాగా విడుదల చేశారు. దీంతో.. 24 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉన్నారన్న విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ఈ ఫోటో బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు.. అభిమానులు బండి సంజయ్ తో పాటు బీజేపీ నేతలకు కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా బయటకు వచ్చిన ఫోటోను బండి సంజయ్ కు చూపించాలని.. సీఎం కేసీఆర్ పై ఆయన బెంగ పెట్టుకొని.. తరచూ ఆయన్ను చూపించాలని అడుగుతారని.. తాజాగా వెల్లడైన ఫోటోలు సరిపోతాయా? అన్న ప్రశ్నల్ని పంచ్ ల రూపంలో సంధిస్తున్నారు.

Tags:    

Similar News