కామారెడ్డిలో కేసీఆర్ పోటీ వెనుక అసలు వ్యూహం ఇదేనట
రాజకీయం ఎవరైనా చేస్తారు. కానీ.. పక్కా వ్యూహాల్ని సిద్దం చేయటం ఒక ఎత్తు అయితే వాటిని అమలు చేయటం మరో ఎత్తు
రాజకీయం ఎవరైనా చేస్తారు. కానీ.. పక్కా వ్యూహాల్ని సిద్దం చేయటం ఒక ఎత్తు అయితే వాటిని అమలు చేయటం మరో ఎత్తు. వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే టాలెంట్ గులాబీ సార్ సొంతం. తాజా ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నట్లుగా చెప్పి అందరిని విస్మయానికి గురి చేశారు. తాను రెండు స్థానాల నుంచి పోటీ చేయటానికి కారణాన్ని చెప్పిన వైనం సంతృప్తికరంగా లేదన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
రెండు స్థానాల నుంచి పోటీ చేయటం వెనుక ఇప్పటికే పలు విశ్లేషణలు వచ్చినప్పటికి.. తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల పలు అంశాల్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ మర్చిపోకూడని అంశం ఏమంటే.. కేసీఆర్ సైతం స్వయంగా తాను కామారెడ్డిలో పోటీ చేయటం వెనుక ఒక వ్యూహం ఉందని చెప్పారు. ఇంతకూ ఆయన వ్యూహం ఏమిటన్న అంశాన్ని సింగిల్ లైన్ లో చెప్పేయాలంటే.. ఒక్క దెబ్బకు పలు పిట్టలు అన్న సూత్రాన్ని అమలు చేస్తున్నట్లుగా చెప్పాలి.
కామారెడ్డిలో పోటీ చేయటం ద్వారా పార్టీని ఉత్తర తెలంగాణలో పట్టు బిగించటం.. ఓట్లు కాంగ్రెస్ కు చీల్చకుండా చూసుకోవటంతో పాటు కుమార్తె కవితకు లోక్ సభ ఎన్నికల నాటికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవటం కూడా లక్ష్యమని చెప్పాలి. హైదరాబాద్ పాతబస్తీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత వారంతా కాంగ్రెస్ వైపునకు తరలటం తెలిసిందే.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా నిలిచిన నేపథ్యంలో.. అక్కడ పార్టీ అధికారంలోకి రావటం తెలిసిందే. ఇప్పుడు అదే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికి తోడు కర్ణాటక ఎన్నికల తర్వాత ముస్లింలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ అధిక్యత మీద కొత్త సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. దీంతో.. తానే స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా చెబుతారు.
కామారెడ్డిలో పోటీ చేయటం ద్వారా.. ఉత్తర తెలంగాణలో పట్టు జారిపోకుండా ఉండేందుకు తానే స్వయంగా బరిలోకి దిగారు కేసీఆర్. దీనికి తోడు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయటం ఖాయమైన నేపథ్యంలో.. తాజా ఎన్నికల్లో గులాబీ అధిక్యత సాధించని పక్షంలో ఎదురయ్యే పరిణామాలు ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకే.. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయాల్సి వచ్చిందని చెప్పాలి.