ఎగ్జిట్ పోల్స్ బేఫికర్.. కేసీఆర్ ధైర్యం వెనుక?!
తెలంగాణ ఎన్నికల పోలింగ్ అనంతరం వచ్చిన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లోనూ(ఒకే ఒక్కటి తప్ప) బీఆర్ ఎస్ పార్టీకి పట్టం కట్టలేదు
తెలంగాణ ఎన్నికల పోలింగ్ అనంతరం వచ్చిన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లోనూ(ఒకే ఒక్కటి తప్ప) బీఆర్ ఎస్ పార్టీకి పట్టం కట్టలేదు. కాంగ్రెస్ మెజారిటీ సీట్లుదక్కించు కుంటుందనే చెప్పాయి. అయితే.. కాంగ్రెస్ కూడా క్లీన్ స్వీప్ చేస్తుందని ఏ పోల్ సర్వే వెల్లడించలేదు. ఇదే ఇప్పుడు కేసీఆర్‌కు.. తెలంగాణ మంత్రులకు ధైర్యాన్నిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎగ్జిట్ పోల్స్‌లో కొన్ని 45 నుంచి 50 వరకు బీఆర్ ఎస్‌కు సీట్లు దక్కుతాయని చెప్పుకొచ్చాయి. అదేసమయంలో కాంగ్రెస్‌కు 56-60 మధ్య వస్తాయని చెప్పుకొచ్చాయి.
ఈ నేపథ్యంలోనే అటు కేసీఆర్ అయినా..ఇటు మంత్రి కేటీఆర్ అయినా.. చాలా ధైర్యంగా ఉన్నారని అంటున్నారు. కేటీఆర్ అయితే.. ఎగ్జిట్ పోల్స్ తమను ఏమీ చేయలేవని కూడా చెప్పారు. ఇక, కేసీఆర్ శుక్రవారం ఉదయం నుంచిసాయంత్రం వరకు పార్టీ నాయకులకు ఫోన్లు చేసి.. ధైర్యం చెప్పారు. తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని.. దీనిలో ఎలాంటి తేడా ఉండదని కూడా ఆయన వెల్లడించారు. ఎవరూ అధైర్య పడొద్దు.. ఆగం కావొద్దని కూడా వెల్లడించారు. ఇక, కేటీఆర్ అయితే.. తనకు ప్రశాంతంగా నిద్ర పట్టిందని.. 3న విజయం తథ్యమని ట్విట్టర్లో వెల్లడించారు. కానీ, ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీఆర్ ఎస్‌కు వ్యతిరేకంగానే ఉన్నాయి.
మరి ఇంత వేడిలోనూ బీఆర్ ఎస్ ఎందుకు ధైర్యంగా ఉంది? అధికారం తమదేనని ఎలా చెప్పగలుగుతోందని.. పెద్ద చర్చగా మారింది. దీనికి కారణం.. ప్రతి ఎగ్జిట్ పోల్ సర్వే కూడా.. 45 కు పైగానే బీఆర్ ఎస్‌కు అభ్యర్థులు దక్కుతారని చెప్పడమే. ఇదే జరిగితే.. తమ మిత్రపక్షం ఎంఐఎం నుంచి గెలిచే(ఇది కూడా పోల్ సర్వేలు చెప్పిందే) ఏడుగురు తమతోనే ఉండనున్నారని బీఆర్ ఎస్ ధీమా. దీంతో మేజిక్ ఫిగర్ 60కి దాదాపుచేరువ అయినట్టే. అంటే.. 45+7 = 52. ఇక, మిగిలిన ఎనిమిది మందిలో ఎవరైనాఇద్దరు స్వతంత్రులు గెలిచినా.. వారిని తీసుకునేందుకు పార్టీ రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
అదేసమయంలో కాంగ్రెస్ గెలిచినా.. అధికారంలోకి వచ్చినా.. తమకు ప్రాధాన్యం ఉండదని.. తమకు పదవులు దక్కవని భావిస్తున్న నాయకులపైనా బీఆర్ ఎస్ అధినేత గురి పెట్టారు. ఇలాంటి నాయకులను ఓ 10 మందిని ఏరి వెతికి పట్టుకుని తన చెంతకు చేర్చుకుని.. పదవుల హామీ ఇచ్చేస్తే.. హ్యాట్రిక్ కొట్టడం తనకు సునాయాసమని ఆయన అంచనా వేస్తున్నారు. వీరిలో జనసేన అభ్యర్థులు కూడా ఒకరిద్దరు ఉన్నట్టు లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమే అయినా.. అధికారం మాత్రం జారిపోకుండా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనేది రాజకీయ వర్గాల టాక్. మరి ఏంజరుగుతుందో చూడాలి.