బీజేపీలోకి క్యాసినో కింగ్
మంగళవారం నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు.
క్యాసినో కింగ్ గా బాగా పాపులరైన చికోటి ప్రవీణ్ కుమార్ బీజేపీలో చేరటానికి రంగం సిద్ధమైంది. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. పార్టీలో చేరి రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని చికోటి గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. పార్టీలో చేరే విషయమై గతంలోనే చికోటి బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళని కలిశారు.
చికోటి ప్రయత్నాలు ఈరోజు సక్సెస్ కాబోతోంది. అసెంబ్లీకి పోటీచేసేట్లయితే ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి రెడీ అవుతున్నారట. పార్లమెంటుకు అయితే జహీరాబాద్ నియోజకవర్గం నుండి రెడీ అని చికోటి పార్టీ పెద్దలకు చెప్పినట్లు ప్రచారంలో ఉంది. నగరానికే చెందిన చికోటి ముందుగా రియల్ ఎస్టేట్ తో మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదిగారు.
చివరకు క్యాసినో కింగ్ గా తెలుగురాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యారు. శ్రీలంక, నేపాల్, థాయ్ ల్యాండ్, రష్యా తదితర దేశాలకు వీవీఐపీలను తీసుకెళ్ళి క్యాసినోలు ఆడించటం, నిర్వహించటంలో చికోటి ఆరితేరిపోయారు.
క్యాసినో ఆడుతున్నారన్న కారణంగానే ఈమధ్యనే చికోటిని థాయ్ ల్యాండ్ పోలీసులు అరెస్టుచేసి బెయిల్ పైన విడుదల చేసిన విషయం సంచలనమైంది. హిందుత్వ ప్రధాన అజెండాతో చికోటి ‘ధర్మ రక్ష’ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటుచేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో చికోటి లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది బీజేపీలో చేరుతారో చూడాలి. హిందువుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతోనే చికోటి ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా చికోటి నివసిస్తున్నది కూడా ఎల్బీ నగర్ లోనే అట. కాబట్టి ఈ నియోజకవర్గంలో బాగా పట్టున్నది కాబట్టి గెలుపు కూడా చాలా సులభమని చికోటి అనుకుంటున్నారు. మరి ఇప్పటికే చికోటిని చుట్టుముట్టిన వివాదాలు, అరెస్టులపై బీజేపీ నేతలు ఏమి సమాధానాలు చెబుతారన్నది ఆసక్తిగా మారింది. ఇంత వివాదాస్పదుడైన చికోటిని పార్టీలో చేర్చుకోవటమే కాకుండా ఏకంగా టికెట్ ఇచ్చి పోటీలోకి దింపితే ప్రత్యర్ధులు చూస్తు ఊరుకుంటారా ?