రైలు కిటికీ నుంచి పడిన 8 ఏళ్ల చిన్నారి.. కట్ చేస్తే..?

ఆదివారం రాత్రి జరిగిన ఈ షాకింగ్ ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.

Update: 2024-10-16 04:50 GMT

అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకుంది. కదులుతున్న ట్రైన్ విండో లో నుంచి ప్రమాదవశాత్తు జారి పడిన ఒక చిన్నారి ఉదంతం గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. రైల్వే పోలీసుల సాహసం చిన్నారిని సేవ్ చేసిన వైనం తెలిస్తే వారిని అభినందించకుండా ఉండలేం. ఆదివారం రాత్రి జరిగిన ఈ షాకింగ్ ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంతకూ ట్రైన్ కిటికీలో నుంచి చిన్నారి ఎలా పడిపోయింది? ఆ తర్వాతేమైంది? అన్న వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని మథురకు వెళ్లేందుకు ఒక ఫ్యామిలీ తమ ఎనిమిదేళ్ల చిన్నారితో కలిసి రైలెక్కారు. వీరు సీట్లు బోగీలోని అత్యవసర కిటికీ వద్ద ఉన్నాయి. అత్యవసర కిటికీల వద్ద గ్రిల్ ఉన్నప్పటికీ.. దాన్ని కూడా తీసే వీలుంటుందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొందరు ప్రయాణికులు ఈ కిటికీని తెరిచి ఉంచారు. ప్రయాణం మధ్యలో చిన్నారి కిటికీ నుంచి జారి కిందకు పడిపోయింది. దీంతో షాక్ తిన్న తల్లిదండ్రులు.. తమ చిన్నారి ట్రైన్ లో నుంచి పడిపోయిన విషయాన్ని లలిత్ పుర్ రైల్వేస్టేషన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో స్పందించిన వారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తో కలిసి గాలింపులు చేపట్టారు.

మొత్తం నాలుగు టీంలుగా ఏర్పడి.. రాత్రి వేళ చిమ్మచీకట్లో పదహారు కిలోమీటర్ల మేర కాలినడకన గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పట్టాల పక్కన ఉన్న ఒక చెట్ల పొదల్లో గాయాలతోఉన్న చిన్నారిని గుర్తించారు.అప్పటికే స్ప్రహ తప్పిన బాలికను తీసుకొని.. అటుగా వెళుతున్న గూడ్స్ రైలును ఆపారు. ఆ వెంటనే తనను లలిత్ పుర్ కు తరలించారు.

అక్కడి ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన రైల్వే పోలీసుల తీరుకు చిన్నారి తల్లిదండ్రులు తమ సంతోషాన్నితెలియజేశారు. చిన్నారిని రెస్క్యూ చేసిన రైల్వే పోలీసుల వీడియోను వారుసోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అనూహ్య ఘటన జరిగిన వెంటనే స్పందించిన రైల్వే పోలీసుల తీరును.. సదరు అధికారుల్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వారిని రియల్ హీరోలుగా పేర్కొంటూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని.. క్రమంగా కోలుకుంటున్నట్లుగా బాధిత తల్లిదండ్రులు వెల్లడించారు.

Tags:    

Similar News