చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ తెరవబోయిన చిన్నారికి షాక్.. షాకింగ్ వీడియో!

తాజాగా ఓ చిన్నారి సూపర్ మార్కెట్‌ లో ఫ్రిజ్‌ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘోరం నిజామాబాద్ లో జరిగింది.

Update: 2023-10-03 04:21 GMT

ఇంట్లో చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారనో.. లేక, కంపెనీ ఉంటారనో చాలామంది పెద్దలు వాళ్లను సూపర్ మార్కెట్లకు తీసుకెళ్తుంటారు. అయితే సూపర్ మార్కెట్లకు వెళ్లిన పిల్లలను కాస్త ఫ్రీగా వదిలేసి, వాళ్ల పనిలో వారు బిజీగా ఉంటుంటారు. ఈ గ్యాప్ లో ఐస్ క్రీం లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ వంటివి ఫ్రిడ్జ్ అద్దాల్లోంచి కనిపించేసరికి పిల్లలు లొట్టలేస్తుంటారు. ఫ్రిజ్‌ లు ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

తాజాగా ఓ చిన్నారి సూపర్ మార్కెట్‌ లో ఫ్రిజ్‌ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘోరం నిజామాబాద్ లో జరిగింది. అవును... సూపర్ మార్కెట్ లో చాక్లెట్ కోసం ఫ్రిజ్ తీయబోయిన ఒక చిన్నారి షాక్ కొట్టి మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో షాకింగ్ గా ఉంది. సూపర్ మార్కెట్ నిర్వాహకుల అలసత్వం వల్లే తమ చిన్నారి బలైందని ఆమె తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... నిజామాబాద్ జిల్లా నందిపేటలోని నవీపేటకు చెందిన రాజశేఖర్ తన కూతురు రుషిత (4)తో కలిసి పట్టణంలోని సూపర్ మార్కెట్‌ కు వెళ్లాడు. అక్కడ తండ్రి రాజశేఖర్ తన పనిలో తాను నిమగ్నమవగా.. కూతురు లోపల కలియ తిరుగుతూ సరదాగా తిరుగుతుంది.

ఈ క్రమంలో చిన్నారి రుషితకు ఫ్రిజ్ లో చాక్లెట్ కనిపించింది. దీంతో చాక్లెట్ కోసం ఎంతో ఆశగా ఫ్రిజ్‌ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో ఫ్రిజ్ డోర్ తెరిచే క్రమంలో ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని తండ్రి రాజశేఖర్ చాలాసేపటి వరకు గమనించలేదు.

అనంతరం కాసేపటి తర్వాత ఫ్రిజ్ వైపు వెళ్తుండగా తన చిన్నారి కూతురు విగత జీవిగా కనిపించింది. దీంతో షాక్ కి గురైన రాజశేఖర్ వెంటనే తేరుకుని, చిన్నారిని చేతిలోకి తీసుకుని పరుగుపెట్టాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల ఆసుపత్రికి తరలించాడు. అనంతరం వైద్యులు ఆ చిన్నారిని పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో... కుటుంబ సభ్యులు షాక్‌ కు గురయ్యారు.

ఆడుతూ పాడుతూ సూపర్ మార్కెట్ కి వెళ్లిన చిన్నారి.. తిరిగి విగత జీవిగా రావడంతో తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సూపర్ మార్కెట్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ చిన్నారి చనిపోయిందని ఆరోపిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Tags:    

Similar News