గంటకు 450 కి.మీ వేగంతో దూసుకెళ్లే చైనా రైలు.. మనమెప్పుడు?
గంటకు అత్యధికంగా 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ ను ప్రపంచానికి పరిచయం చేసింది డ్రాగన్ దేశం.
మన డప్పు మనమే కొట్టుకుంటాం కానీ కొన్నిసార్లు మన చుట్టూ ఉండే దేశాలు.. సాంకేతికంగా వారు సాధిస్తున్న విజయాల్ని చూసినప్పుడు మనం ఎంత వెనుకపడి ఉన్నామన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ప్రపంచ టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో మనం కూడా ఒకటన్న గొప్పలు చెప్పుకుంటున్నప్పటికి.. మనం సాధిస్తున్న విజయాలు మిగిలిన దేశాలతో పోలిస్తే తక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ముఖ్యంగా చైనా దూసుకెళుతున్న తీరు చూస్తే.. అదిప్పటికే సాధించిన ఘనతలు మనం రానున్న పాతికేళ్లలో అయినా అందుకుంటామా? అన్నది ప్రశ్న.
అలాంటి సందేహాలకు బలం చేకూరే మరో ఆవిష్కరణను తాజాగా బయట ప్రపంచానికి విడుదల చేసింది చైనా. గంటకు అత్యధికంగా 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ ను ప్రపంచానికి పరిచయం చేసింది డ్రాగన్ దేశం. దీన్ని సీఆర్ 450గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఈ టెక్నాలజీ అద్భుతాన్ని బీజింగ్ లో పరిక్షించారు. గంటకు 450కి.మీ. వేగంతో అని చెప్పినప్పటికీ 400 కిలోమీటర్ల వేగాన్ని ఈ ట్రైన్ అందుకుంది.
అన్నింటికి మించిన ఈ ట్రైన్ డిజైన్ చూసినంతనే మనసు పడేలా ఉంది. చాలా నాజుగ్గా.. బుల్లెట్ షేప్ ముక్కుతో ముందు భాగాన్ని తీర్చి దిద్దారు. గరిష్ఠంగా గంటకు 450కి.మీ. వేగాన్ని ఈ రైలు అందుకుంటుందని చైనా రైల్వే వెల్లడించింది. దీన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందనిపేర్కొంది. ఈ రైలు ప్రజలకు అందుబాటులోకి వస్తే బీజింగ్ నుంచి షాంఘైకు కేవలం రెండున్నర గంటలే పడుతుంది. ప్రస్తుతం ఈ దూరానికి నాలుగు గంటల సమయం పడుతోంది.
చైనాలోని హైస్పీడ్ రైలు వ్యవస్థ అతి పెద్దదిగా చెప్పాలి. అది మొత్తం 45వేల కి.మీ. మేరకు విస్తరించింది ఉంది. ఈ రైలును డిసెంబరులో టెస్టు చేస్తామని సెప్టెంబరులోనే వెల్లడించింది. ఆ మాటకు తగ్గట్లే.. ఈ రోజు ప్రయోగాత్మకంగా నడిపి చూవారు. చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా హైస్పీడ్ రైళ్లు.. వంతెనలు.. ట్రాక్ లు.. సొరంగాలు నిర్మించనున్నారు.
ఇక.. ఈ అత్యాధునిక బుల్లెట్ ట్రైన్ బరువు కేవలం 10 టన్నులుగా చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీఆర్ 400 మోడల్ కంటే ఇది 12 శాతం తక్కువ. అంతేకాదు.. విద్యుత్ వినియోగం కూడా ఇరవై శాతం తక్కువగా వినియోగించుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటి మోడల్ కంటే గంటకు 50కి.మీ. అధిక వేగంతో దౌడు తీయనుంది. ఇంజిన్ పరీక్షలో గరిష్ఠంగా గంటకు 453కి.మీ. వేగాన్ని అందుకున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే చైనా తన జె-36 యుద్ధ విమానాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధ విమానం అమెరికాకు చెందిన ఎఫ్35, ఎఫ్22 రాప్టర్లను సవాలు చేస్తుందన్న మాట వినిపిస్తోంది.