మ్యాటర్ సీరియస్.. పాకిస్తాన్ లోకి చైనా సైన్యం.. భారత్ బీ అలర్ట్
దీంతో హైజాక్ కు పాల్పడ్డామని వెల్లడించారు. పాక్ ప్రభుత్వానికి తాము 48 గంటల గడువు ఇచ్చామని.. దానిని ఉల్లంఘించిన ఫలితమే ఇదంతా అని బలూచ్ రెబల్స్ స్పష్టం చేశారు.;
బలూచిస్థాన్ రెబల్స్ పాకిస్థాన్ కు తలబొప్పి కట్టిస్తున్నారు.. తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చేతల్లో చూపిస్తున్నారు. సాధారణ పౌరులనో, పాకిస్థాన్ ప్రభుత్వ ఆస్తులనో కాదు ఏకంగా పాక్ లో పరిపాలనను శాసించే సైన్యాన్నే టార్గెట్ చేశారు. గత వారం ఏకంగా జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసి.. 214 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు ప్రకటించారు. బలూచ్ లిబరేషన్ గ్రూప్ (బీఎల్జీ) ప్రధాన డిమాండ్.. తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనేదే. కానీ, దీనిని పాక్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో హైజాక్ కు పాల్పడ్డామని వెల్లడించారు. పాక్ ప్రభుత్వానికి తాము 48 గంటల గడువు ఇచ్చామని.. దానిని ఉల్లంఘించిన ఫలితమే ఇదంతా అని బలూచ్ రెబల్స్ స్పష్టం చేశారు.
బలూచిస్థాన్ చాలా కీలకమైన ప్రాంతం. సహజ వనరుల పరంగా పాకిస్థాన్ కు ఇదో పెన్నిధి అనుకోవాలి. అందుకే చైనా కూడా బలూచిస్థాన్ పై కన్నేసింది. చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ బలూచిస్థాన్ మీదుగానే వెళ్తుంది. 2015లో చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC) మొదలైంది. పాక్ ఆర్థిక వ్యవస్థకు దీనిని అప్పట్లో ‘గేమ్ ఛేంజర్’ గా అభివర్ణించారు. ఇంత కీలక ప్రాజెక్టు బెలూచిస్థాన్ మీదుగా వెళ్తుంది. అక్కడ రెబల్స్ దాడులతో పాకిస్థాన్ కు దిమ్మతిరిగినట్లయింది. ఈ నేపథ్యంలోనే చైనా సైన్యం కలగజేసుకోనుందట.
బలూచిస్థాన్ లోకి తమ సైన్యాన్ని పంపేందుకు చైనా సిద్ధమైనట్లు పాక్ మీడియా చెబుతోంది. ఆర్థిక కారిడార్ భద్రతే లక్ష్యంగా, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీని అణచేందుకు చైనా సైన్యం రంగంలోకి దిగనుందట. మరోవైపు చైనా సైన్యంలో పెను మార్పులు జరుగుతున్నాయి. అధ్యక్షుడు జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితులైన ఫుజియాన్ నాయకులు, జనరల్స్ పై చర్యలు మొదలయ్యాయి. సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ హి వైడాంగ్ ను అరెస్టు చేశారు. ఈ కమిషన్ కు జిన్ పింగ్ చైర్మన్ కావడం గమనార్హం. ఇటీవల చైనా కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులను మార్చేస్తున్నది.
ఒక సార్వభౌమ దేశంలో మరో దేశపు సైన్యం అడుగుపెట్టడం అంటే నామోషీనే. పాక్ లో 2011లో లాడెన్ ను చంపేందుకు అమెరికా నేవీ సీల్స్ అతిపెద్ద ఆపరేషన్ చేశారు. ఇప్పుుడు చైనా ఆర్మీ కూడా ఆ దేశ గడ్డపై దిగుతోంది. ఈ పరిణామంపై భారత్ ఓ కన్నేసి ఉంచాల్సిందే.