రెండు నిమిషాలే... ఉద్యోగులకు కొత్త టాయిలెట్ యూసేజ్ రూల్స్!

అవును... తాజాగా చైనా దక్షిణ ప్రాంతంలోని ఒక కంపెనీ.. తమ ఉద్యోగులకు సరికొత్త నియమాలు పెట్టింది.

Update: 2025-02-22 18:30 GMT

ఆఫీసు అన్నతర్వాత రకరకాల రూల్స్ ఉండేమాట సహజమే! ప్రధానంగా పవర్ సేవింగ్స్ విషయంలో చాలా చోట్ల రూల్స్ ఉంటాయి.. సీటు లో నుంచి లేచిన వెంటనే ఫ్యాన్ ఆపాలని! ఇలాంటివి అత్యంత సహజమే కానీ.. తాజాగా టాయిలెట్ యూసేజ్ విషయంలో కూడా రూల్స్ తీసుకొచ్చిన మేనేజ్మెంట్.. ఉద్యోగులకు షాకిచ్చింది.

అవును... తాజాగా చైనా దక్షిణ ప్రాంతంలోని ఒక కంపెనీ.. తమ ఉద్యోగులకు సరికొత్త నియమాలు పెట్టింది. ప్రధానంగా ఉద్యోగుల మరుగుదొడ్ల వినియోగంపై కఠిన నియమాలు అమలుచేయడంతో ఇప్పుడు ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది! ఏమా కంపెనీ... ఏమిటా రూల్స్.. అనేది ఇప్పుడు చూద్దామ్..!

వివరాళ్లోకి వెళ్తే... గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని ఫోషాన్ లో గల త్రీ బ్రదర్స్ మెషిన్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫిబ్రవరి 11 నుంచి కొత్త టాయిలెట్ యూసేజ్ కి సంబంధించి రూల్స్ తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా... ఉద్యోగులంతా నిర్ణీత సమయాల్లోనే టాయిలెట్స్ ఉపయోగించాలి.. ఒక్కోసారి 2 నిమిషాలే ఉండాలనేవి రూల్స్!

ఇక... ఆ కంపెనీ నిర్ధేశించిన ఆ నిర్ణీత సమయాల విషయానికొస్తే... ఉదయం 8 గంటల ముందు, ఉదయం 10:30 నుంచి 10:40 మధ్య.. మధ్యాహ్నం 12 నుంచి 1:30 మధ్య.. మధ్యాహ్నం 3:30 నుంచి 3:40 మధ్య.. ఇక.. సాయంత్రం 5:30 నుంచి 6:00 గంటల మధ్య మాత్రమే టాయిలెట్స్ ను ఉపయోగించాలి.

అత్యవసరమైతే ఈ సమయాల వెలుపల కూడా టాయిలెట్స్ ను వినియోగించవచ్చు కానీ.. రెండు నిమిషాలే సమయం. ఇచ్చిన సమయం దాటితే వారిపై చర్యలు తీసుకోబడతాయన్నమాట! ఈ నియమాలపై స్పందించిన కంపెనీ... ఈ రూల్స్ ప్రధానంగా క్రమశిక్షణ, ఉద్యోగుల్లో సానుకూల భావోద్వేగాలను పెంపొందించడం కోసమని చెబుతోంది.

ఇదే సమయంలో... ఈ నిర్ణయానికి న్యాయబద్దత చూపేందుకు.. కంపెనీ హువాంగ్ డి నెయి జింగ్ అనే సుమారు రెండు వేల సంవత్సరాల పురాతన చైనీస్ మెడిసిన్ గ్రంథాన్ని ఉదహరించడం గమనార్హం. ఇది చైనాలోని ప్రాచీన వైద్యానికి సంబంధించి మూలగ్రంథంగా చెబుతుంటారు. ఈ నియమాలు ఉద్యోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఏవైనా ఆరోగ్య కారణాల వల్ల మరుగుదొడ్డికి కంపెనీ నిర్ధేశించిన సమయాల్లో కాకుండా.. వెళ్లాల్సి వస్తే అందుకు హెచ్.ఆర్. అనుమతి తీసుకొవాలి. అప్పుడు కూడా అక్కడ గడిపిన సమయానికి జీతంలో కోత కోస్తారంట. ఈ విధానం మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో అమలుకానుంది.

దీంతో... ఇది తమ వ్యక్తిగత హక్కులకు విఘాతం కలిగిస్తుందంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్పందించిన గ్యాంగ్ డాంగ్ యీయూ లా ఫర్మ లాయర్ చెన్ షిసింగ్.. ఈ నియమాలు కార్మిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని.. ఈ నియమాలు చట్టప్రకారం, ఉద్యోగులు, వారి ప్రతినిధుల అంగీకారంతోనే అమలు చేయాలని తెలిపారు.

ఏది ఏమైనా... త్రీ బ్రదర్స్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి.. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలులో ఉన్న ఈ రూల్స్ ని కంపెనీ అన్నట్లుగానే మార్చి 1 నుంచి అమలులోకి తీసుకొస్తుందా.. లేక, ఏవైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News