చింతమనేనా.. మజాకా.. ఊరూవాడా సందడే ..!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేయి చాలా పెద్దదన్న టాక్ జోరుగా వినిపిస్తోంది.;

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేయి చాలా పెద్దదన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. ఇటీవల రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర కుటుంబాలకు కేజీ చొప్పున మటన్‌ను ఇంటింటికీ అందించారు. దాదాపు వెయ్యి కేజీల మటన్‌ను ఆయన అందించారు. ఇప్పుడు శ్రీరామ నవమిని పురస్కరించుకుని కూడా.. అదే తరహాలో ఆయన తన దాతృత్వం చూపించారు.
ప్రజలకు మెరుగైన సుపరిపాలన అందించేదే రామరాజ్యమని, అటువంటి రామరాజ్యమే స్ఫూర్తిగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ సీఎం చంద్రబాబము పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పే.. చింతమనేని తాను కూడా ఈ సుపరిపాలనలో భాగమయ్యారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు, పెదవేగి, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల పరిధిలోని గ్రామాల్లో గల దాదాపు 500 రామాలయాల్లో జరగనున్న శ్రీరామ నవమి వేడుకల నిమిత్తం పానకం తయారీ కోసం తనవంతు సాయంగా పెద్ద ఎత్తున బెల్లాన్ని పంచారు.
మొత్తం ఎనిమిది టన్నుల బెల్లాన్ని చింతమనేని ప్రత్యేకంగా అనకాపల్లి నుంచి తెప్పించి దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేయడం.. నియోజకవర్గంలోనే కాదు.. రాష్ట్రంలో పెద్ద రికార్డుగా మారింది. ప్రత్యేకంగా కేటాయించిన ఆటోలు, జీపులు, కార్లు వాహనాల ద్వారా బెల్లం ఆయా గ్రామాలకు చేరుకొని రామాలయాలకు అందించే విధంగా స్థానిక కూటమి నాయకులకు ప్రత్యేక బాధ్యతలు కేటాయించారు.
ప్రతి రామాలయానికి 15 కేజీల బెల్లపు కుందె ఇవ్వాలని, భక్తులు ఎక్కువగా ఉండే ఆలయాలకు అదనపు బెల్లపు కుందె లు కూడా ఇవ్వాలని చింతమనేని సూచించారు. గత 5 ఏళ్ల వైసిపి పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు అని, కూటమి ప్రభుత్వం వచ్చాక వారి కష్టాలు తొలగిపోయి జీవితాల్లో ఆనందాలు తిరిగి పొందుతున్నారని, వాటిలో భాగంగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు పండగలు కూడా ఎంతో ఆనందంగా, ఘనంగా నిర్వహిస్తున్నారని అందుకే.. తాను బెల్లాన్ని పంచుతున్నానని చెబుతున్న చింతమనేని.. చేతలకు ప్రజలు మురిసిపోతున్నారు.