టీడీపీ ఫైర్ బ్రాండ్.. తీవ్ర అసంతృప్తి.. రీజ‌నేంటి?

దీంతో అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌డ‌ల్లా.. బ‌యట‌కు చెప్పేస్తున్నారు. త‌మ‌ను వేధించిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు

Update: 2024-11-15 08:20 GMT

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన కీల‌క నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు. ఎంత దాచుకునేందుకు ప్ర‌యత్నించినా.. ఆయ‌న ఈ అసంతృప్తిని దాచుకోలేక పోతున్నారు. దీంతో అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌డ‌ల్లా.. బ‌యట‌కు చెప్పేస్తున్నారు. త‌మ‌ను వేధించిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు. కానీ, ఈ విష‌యంలో చంద్ర‌బాబు మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

వైసీపీ హ‌యాంలో చింత‌మనేని ప్ర‌భాక‌ర్‌పై అప్ప‌టి ప్ర‌భుత్వం సూచ‌న‌ల మేర‌కు కేసుల‌పై కేసులు పెట్టారు. 62 రోజుల పాటు.. జైలు నుంచి బ‌య‌ట‌కు రాకుండా అధికారులు క‌ట్ట‌డి చేశారు. ఒక కేసులో బెయిల్ వ‌స్తే.. అదే రోజు మ‌రో కేసులో ఆయ‌న‌ను జైలుకు పంపించారు. ఇలా.. మొత్తంగా 27 కేసులు చింత‌మ‌నేనిపై న‌మోదు చేశారు. ప్రతి కేసులోనూ ఆయ‌న బెయిల్ తెచ్చుకోవ‌డం.. ఇంత‌లోనే మ‌రో కేసు పెట్ట‌డం.. ఇలా 62 రోజుల పాటు ఆయ‌న జిల్లా జైల్లోనే మ‌గ్గాల్సి వ‌చ్చింది.

దీంతో ఆనాటి ఆవేద‌న ఇప్ప‌టికీ చింత‌మ‌నేనిని వెంటాడుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో త‌న‌ను వేధించి.. అక్ర‌మ కేసులు పెట్టించిన ఉన్న‌తాధికారుల‌పైనే చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌ది చింత‌మ‌నేని డిమాండ్‌గా ఉంది. ప్ర‌స్తుతం చింత‌మ‌నేనిపై కేసులు పెట్టించిన ఉన్న‌తాధికారులు ప‌లు స్థానాల్లో ప్ర‌మోష‌న్లు తెచ్చుకుని వారి ప‌నుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇదే ఆయ‌న‌కు క‌డుపు ర‌గిలిస్తోంది. త‌న‌ను వేధించి, అక్ర‌మ కేసులు పెట్టిన వారిని ఇప్పుడు వేధించాల‌న్న‌ది ఆయ‌న సూత్రం.

కానీ.. సీఎం చంద్ర‌బాబు మాత్రం.. ఇలాంటివారి ఆశ‌లు నెర‌వేర్చ‌లేక పోతున్నారు. చ‌ట్టం ప్ర‌కార‌మే శిక్షిస్తామ‌ని.. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా.. ఎవ‌రిపైనా కేసులు పెట్ట‌బోమ‌ని చెబుతున్నారు. అయితే.. గ‌తంలో జ‌గ‌న్ ఇలా చేయ‌లేద‌ని.. త‌న‌కు న‌చ్చ‌ని నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టించి వేధించార‌ని ఆయ‌న చెబుతున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌ను వేధించిన వారి జాబితా త‌న ద‌గ్గ‌ర ఉంద‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరుతున్నారు. అందుకే.. త‌న‌కు రాజ‌కీయాలంటేనే విర‌క్తి క‌లుగుతోంద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

Tags:    

Similar News