ప్రధాని మోదీతో మోగాస్టార్ చిరంజీవి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా?

ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన వేడుకలకు ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ హాజరయ్యారు.

Update: 2025-01-14 04:37 GMT

ప్రధాని మోదీ, మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై కనిపించి కనువిందు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన వేడుకలకు ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. ఈ ఇద్దరితో పాటు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు కిషన్ రెడ్డి ఇంట్లో సందడి చేసినా, ప్రధాని మోదీ, చిరంజీవి భేటీ కావడం, పరస్పరం పలకరించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాని, చిరంజీవి కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలుగు ప్రజల పెద్ద పండగ సంక్రాంతి. ఈ సారి కూడా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఎన్నడూ లేనట్లు ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి మెగా స్టార్ చిరంజీవితోపాటు టెన్నిస్ స్టార్ సింధు, తేజ సజ్జా, ప్రముఖ గాయని సునీత తదితరులు హాజరయ్యారు. వేడుకలకు వచ్చిన వారందరినీ ప్రధాని ప్రత్యేకంగా పలకరించారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని చూడగానే ఆలింగనం చేసుకున్నారు. గతంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంలోనూ మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని విపరీతమైన ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు కూడా కార్యక్రమం ప్రారంభ సూచనగా ప్రధాని ఒక ఒత్తి వెలిగించి జ్యోతి ప్రజ్వలన చేయగా, రెండో ఒత్తిని చిరంజీవి వెలిగించాలని ప్రధాని సూచించారు. అంతేకాకుండా ప్రధాని పక్కనే చిరంజీవిని కూర్చొబెట్టుకుని వేడుకలను తిలకించారు. ప్రధాని, చిరంజీవి కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

ఏపీలో కూటమి ఏర్పాటుతోపాటు కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాత్ర ఎంతో ఉందని ప్రధాని మోదీ విశ్వసిస్తున్నారు. అదే సమయంలో ప్రధాని మోదీకి పవన్ గట్టి మద్దతుదారు. దీంతో ప్రధాని మోదీతో మెగాస్టార్ కుటుంబం బాండింగ్ పెరిగిందని అంటున్నారు. ఇక గతంలో యూపీఏ ప్రభుత్వంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేశారు. తెలంగాణలో చిరంజీవిని ఇప్పటికీ కాంగ్రెస్ నేతగానే ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కొన్ని సందర్భాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చిరంజీవి కాంగ్రెస్ నేతగానే ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానితో చిరంజీవి సన్నిహితంగా ఉండటం రాజకీయంగానూ ఆసక్తికరంగా మారుతోంది.

దక్షిణాదిలో సొంతంగా బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో ఆ పార్టీ బలమైన స్థితిలో ఉండగా, తెలంగాణలో ఇప్పుడిప్పుడే ప్రధాన పార్టీగా ఎదుగుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ పార్టీగా బీజేపీ ప్రచారం చేసుకున్నా, చివర్లో చోటుచేసుకున్న పరిణామాలతో బోల్తా పడింది. అయితే ఎన్నికల్లో పరాజయం తర్వాత మళ్లీ పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఏపీలో పవన్ తో కలిసి వేగంగా ఎదిగేందుకు వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవితో బీజేపీ బంధం బలపరిచేలా అడుగులు వేస్తోందంటున్నారు. ఏపీలోని బలమైన సామాజిక నేపథ్యం ఉన్న చిరంజీవి సినీ గ్లామర్ కూడా తమ పార్టీకి కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే చిరంజీవికి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా అల్లూరి శత జయంత్యుత్సవాలకు ప్రత్యేక అతిథిగా చిరంజీవిని ఆహ్వానించడాన్ని ఉదహరిస్తున్నారు. ఏదైనా చిరంజీవి ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు మార్చాలని కమలం పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News