అధికారులను వాడేస్తున్న తమ్ముళ్లు.. బాబు మేల్కోవాలి.. !
కేంద్రం నుంచి రాష్ట్రానికి సమాచా రం అందే వరకు కూడా సదరు నేతలు చేస్తున్న వ్యవహారాలు బయటకు రాకపోవడం గమనార్హం.;
టీడీపీ నాయకులు హద్దుల్లో ఉండాలని.. అక్రమాలు, అవినీతి జోలికి పోకుండా.. ప్రజలకు సేవ చేయాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా.. నాయకుల్లోను, ఎమ్మెల్యేల్లోనూ ఎక్కడా మార్పు రావడం లేదు. మార్పు కనిపించడమూ లేదు. పైగా ఇప్పుడు సరికొత్త పుంతల్లో అవినీతికి పాల్పడుతున్నారు. దీంతో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి వ్యవహారం.. కేంద్రం వరకు పాకింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి సమాచా రం అందే వరకు కూడా సదరు నేతలు చేస్తున్న వ్యవహారాలు బయటకు రాకపోవడం గమనార్హం.
ఏం జరిగింది?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో లంచావతా రులుగా మారిపోయారన్న చర్చ ఉంది. ఈ ఇద్దరు నాయకులకు గతంలోనే చంద్రబాబు క్లాస్ ఇచ్చారు. ఇది తగదు.. ప్రజలకు సేవ చేయండి! అని హెచ్చరించారు. ఈ విషయంలో తేడా వస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించారు. దీంతో నాయకులు అలెర్ట్ అయ్యారు. అయితే.. వారు చేస్తున్న అక్రమాలను మాత్రం ఆపలేదు.
వారి అవినీతి, అక్రమాలను అధికారుల చేత చేయిస్తూ.. తాము జేబులు నింపుకొంటున్నారు. అధికారుల ను లైన్‌లో పెట్టి.. భవన యజమానులు, లారీ ఓనర్లను భయ భ్రాంతులకు గురి చేసి.. లంచాలు గుంజు కుంటున్న వ్యవహారం తాజాగా తెరమీదికి వచ్చింది. ఇది కూడా .. కేంద్ర నిఘా సంస్థల నుంచి రాష్ట్రానికి సమాచారం రావడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. ఓ నాయకుడు పోలీసులను వినియోగించి.. లారీ యజమానులను బెదిరించడంతోపాటు.. వారి నుంచి సొమ్ములు గుంజుతున్నారు.
అయితే.. అందరూ ఒకే విధంగా ఉండరు కదా.. ఓ యజమాని సోదరుడు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. దీంతో సదరు యజమాని సోదరుడుకి..ఇక్కడ జరుగుతున్న అవినీతిపై ఉప్పించారు. ఆధారాలను కూడా పంపించారు. దీంతో ఆయన కేంద్రపెద్దలకు సమాచారం ఇచ్చారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం నేరుగా చంద్రబాబు కార్యాలయానికి ఫ్యాక్స్ పంపించింది. దీంతో విషయం వెలుగు చూసింది. దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇలా చేసి ప్రభుత్వ పరువును తీస్తున్నారని.. ఆయన వ్యాఖ్యానించారని సమాచారం. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.