కోవిడ్ - 19 గురించి అమెరికా సీఐఏ కొత్త అంచనా ఇదే!
అవును... ప్రపంచాన్ని అల్లల్లాడించిన మహమ్మారి కరోనా వైరస్ ఎక్కడ నుంచి వ్యాపించిందనే విషయంపై అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఓ కొత్త అంచనాను వెలువరించింది.
కోవిడ్ - 19 వైరస్... ఈ పేరు ప్రపంచాన్ని వణికించేసిందనే సంగతి తెలిసిందే. ఈ వైరస్ పేరు చెబితే ఇప్పటికీ వణికిపోయే మనుషులు, కుమిలిపోయే కుటుంబాలు ఎన్నో ఉంటాయి. దివాలా తీసిన దేశాలు కనిపిస్తాయి. తాజాగా ఈ వైరస్ గురించి అమెరికాలో కొత్తగా కొలువైన ప్రభుత్వం నుంచి ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది. ఈ మేరకు సీఐఏ తన అంచనాను వెల్లడించింది.
అవును... ప్రపంచాన్ని అల్లల్లాడించిన మహమ్మారి కరోనా వైరస్ ఎక్కడ నుంచి వ్యాపించిందనే విషయంపై అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఓ కొత్త అంచనాను వెలువరించింది. ఇందులో భాగంగా... కోవిడ్ వైరస్ చైనా ప్రయోగశాల నుంచే బయటకు వచ్చి ఉండొచ్చని, జంతువుల నుంచి ఉద్భవించిందైతే కాకపోవచ్చని వెల్లడించింది.
డొనాల్డ్ ట్రంప్ నియమించిన సీఐఏ కొత్త డైరెక్టర్ జాన్ ర్యాట్ క్లిప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెల్లడించిన మొదటి విషయం ఇదే కాగా... జంతువుల నుంచి కాక, పరిశోధనల మూలంగానే కోవిడ్ - 19 వైరస్ బయటకు వచ్చినట్లు తమకున్న సమాచారమని తెలిపారు! అయితే.. దీన్ని పూర్తిగా విశ్వసించలేమని కూడా సీఐఏ చెప్పడం గమనార్హం.
ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ గా పనిచేసిన ర్యాట్ క్లిప్.. వూహాన్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచే కోవిడ్ - 19 వైరస్ లీకై ఉండోచ్చనే అభిప్రాయానికి ఎప్పటి నుంచో అనుకూలంగా ఉన్నారు. మొదటి కోవిడ్ కేసులు నమోదైన మాంసం మార్కెట్ కు ఈ ఇనిస్టిట్యూట్ 40 నిమిషాల ప్రయాణ దూరంలో ఉందని గుర్తుచేస్తుంటారు.
ఈ సందర్భంగా స్పందించిన ర్యాట్ క్లిఫ్... అమెరికాకు అనేకానేక విషయాల్లో చైనా నుంచి ముప్పు పొంచి ఉందని.. దీనిపై దృష్టి సారించాలని తాను ఇప్పటికే పలుమార్లు చర్చించానని తెలిపారు. ఇదే సమయంలో.. కొన్ని మిలియన్ల అమెరికా పౌరులు అర్ధాంతరంగా తమ ప్రాణాలు కోల్పోవడానికి గల కారణం తెలియాలని అన్నారు.
దీంతో.. ఈ విషయంపైనా ట్రంప్ 2.0 సీరియస్ గానే ఉందనే విషయం స్పష్టమవుతుందని అంటున్నారు పరిశీలకులు.