#IdhiManchiPrabhutvam... ఎందుకో చెబుతున్న చంద్రబాబు!
#IdhiManchiPrabhutvam అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పిన బాబు... ప్రభుత్వ పథకాలతో ప్రజలకు చేకూరిన లబ్ధిని ఈ నెల 20 నుంచి ఆరు రోజుల పాటు వివరించాలని అన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు కావొస్తుంది. ఈ 100 రోజుల్లోనూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరెవేర్చుకుంటూ.. ప్రధానంగా, దారితప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. వీటితో పాటు ఏపీలో ఏ-అంటే అమరావతి, పీ-అంటే పోలవరం అన్ని ఇప్పటికే స్పష్టం చేసిన చంద్రబాబు వాటికి సంబంధించిన పనులను చకచకా ముందుకు తీసుకెళ్తున్నారు.
అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు కావొస్తున్న నేపథ్యంలో ఎన్డీయే శాసన సభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కోట్లాదిమంది ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మంచి పనులను, #IdhiManchiPrabhutvam అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పిన బాబు... ప్రభుత్వ పథకాలతో ప్రజలకు చేకూరిన లబ్ధిని ఈ నెల 20 నుంచి ఆరు రోజుల పాటు వివరించాలని అన్నారు. ఇదే సమయంలో... ప్రతిపక్ష పార్టీ చేసే విషప్రచారాలను తిప్పికొట్టే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ప్రజా ప్రతినిధులంతా నెలకు 10 రోజులపాటు ప్రజల్లో ఉండాలని స్పష్టం చేశారు.
ప్రతీ ఒక్కరికీ ఇల్లు!:
ఇళ్లు లేని ప్రతీ ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని.. ఇప్పటికే నిర్మాణం మొదలై పెండింగులో ఉన్న ఇళ్లు పూర్తి చేస్తామని.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో... గ్రామాలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలం ఇస్తామని అన్నారు. 2047 విజన్ తో 15% గ్రోత్ రేట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం!:
సూపర్-6 హామీల్లో భాగంగా ఇచ్చిన "ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు" పథకాన్ని దీపావళి పండుగ రోజున మొదటి సిలెండర్ ను అందిస్తామని చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఇదే సమయంలో మిగిలిన అన్ని సంక్షేమ కార్యక్రమాలనూ క్రమేనా అమలు చేస్తామని.. అది మన పవిత్ర బాధ్యత అని.. ప్రతీ అడుగు ప్రజల కొసం వేయాలని బాబు స్పష్టం చేశారు.
రాబోయే ఐదేళ్లలో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు!:
గతంలో గ్రామాల్లో 25 వేల కిలో మీటర్ల సిమెంట్ రోడ్లు వేశామని చెప్పిన చంద్రబాబు... రాబోయే ఐదేళ్లలో 17వేల కి.మీ. సీసీ రోడ్లు, 10వేల కి.మీ. సీసీ డ్రెయిన్ ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
రెండేళ్లలో పోలవరం ఫేజ్-1 జాతికి అంకితం!:
ఇక ఏపీ వరప్రదాయని పోలవరానికి రూ.12,500 కోట్లను కేంద్రం ప్రకటించిందని చెప్పిన బాబు.. కొత్త డ్యాఫ్రం వాల్ కూడా నిర్మించాల్సి ఉందని అన్నారు. ఈ క్రమంలోనే 2 ఏళ్లలో పోలవరం ఫేజ్-1 పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ క్రమంలో పోలవరాన్ని పూర్తి చేసి రైతులకు, జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో ఆంధ్రుల రాజధాని అమరావతికి పూర్వవైభవం తీసుకొస్తామని అన్నారు. వరల్డ్ బ్యాంక్ ద్వారా రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్లు అందించేందుకు ముందుకు వచ్చిందని గుర్తుచేశారు!
ఉద్యమంలా... పీఎం సూర్య ఘర్ పథకం!:
ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో భాగంగా ప్రతీ ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకుని, 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తోందని.. దీనికి కొంత మొత్తంలో లబ్ధిదారులు వాటాను కలుపుకుని ఏర్పాటు చేసుకుంటే రాబోయే రోజుల్లో శాశ్వతంగా విద్యుత్ బిల్లులు కట్టే పరిస్థితి ఉండదని బాబు తెలిపారు. దీన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
>> ఇదే సమయంలో... ప్రతినెలా 1వ తేదీన పేదల సేవ కార్యక్రమంలో భాగంగా పింఛన్లను పంపిణీ చేస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. గత ఐదేళ్లలో ఏనాడూ ఒకటో తేదీన జీతం తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు.. ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని తెలిపారు.
>> ఇప్పటికే 100 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేశామని.. వాటిని త్వరలో 203కు పెంచుతామని బాబు వెల్లడించారు.
>> అధికారంలోకి రాగానే ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టిన రూ.1,670 కోట్లు చెల్లిచినట్లు చెప్పిన చంద్రబాబు... రాబోయే రోజుల్లో కూడా 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తామని అన్నారు.
>> ఇక, దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు గౌరవ వేతనం పెంచామని చెప్పిన బాబు... బీసీలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కూడా కేబినెట్ లో ఆమోదించినట్లు తెలిపారు. త్వరలో అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు!
>> అర్చకుల వేతనం రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచినట్లు చంద్రబాబు వివరించారు.
ఈ "#IdhiManchiPrabhutvam " చేసిన మంచిని ప్రజలకు వివరించాలని.. దీనికోసం ఈ నెల 20 నుంచి ఆరు రోజుల పాటు ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశారు!