ఏపీ ఫైబర్ నెట్ కథ కంచికి.. మొత్తం ఉద్యోగులకు ఊస్టింగు!

ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రిక ఏపీ ఫైబర్ నెట్ కథ కంచికి చేరినట్లేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫైబర్ నెట్ ను సంస్కరించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ముందు వెనక ఆలోచించకుండా సిబ్బందిని తొలగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.;

Update: 2025-04-13 20:30 GMT
ఏపీ ఫైబర్ నెట్ కథ కంచికి.. మొత్తం ఉద్యోగులకు ఊస్టింగు!

ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రిక ఏపీ ఫైబర్ నెట్ కథ కంచికి చేరినట్లేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫైబర్ నెట్ ను సంస్కరించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ముందు వెనక ఆలోచించకుండా సిబ్బందిని తొలగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా సాంకేతిక సిబ్బందిని కూడా తొలగించడంతో ఫైబర్ నెట్ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని టాక్ వినిపిస్తోంది. ఫైబర్ నెట్ లో గత ప్రభుత్వ భారీ ఎత్తున అక్రమ నియామకాలు చేపట్టిందని, విధులకు రాకుండానే సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే సరైన రీతిలో ఎంపిక చేయని ఉద్యోగులను తీసేవేయాలని భావించిన ప్రభుత్వం తాజాగా 248 మంది ఔట్ సోర్సింగు సిబ్బందిపై వేటు వేసింది. అయితే వీరిలో 2019 కన్నా ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం నియమించిన ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం.

ఏపీ ఫైబర్ నెట్ లో గత ప్రభుత్వం భారీగా నియామకాలు చేపట్టింది. కేవలం వాట్సాప్ ద్వారా వచ్చిన సూచనలే ఆదేశాలుగా మారి వైసీపీ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో పనిచేస్తున్నవారిని కూడా ఉద్యోగులుగా నియమించారని విమర్శలు ఉన్నాయి. ఇలా నియమించిన వారికి సరైన విద్యార్హతలు లేకపోవడంతోపాటు, కనీసం వారు విధులకు హాజరుకాకుండానే జీతాలు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఫైబర్ నెట్ లో అక్రమ పద్ధతిలో నియమించిన వారిని తొలగించాలని జీవీ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే తాజాగా 248 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసిన ప్రభుత్వం జీవీ రెడ్డి డిమాండ్ కు తలొగ్గినట్లు చెబుతున్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్రమ నియామకాలను గుర్తించాలని భావించింది. ఇదే సమయంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ గా నియమితులైన జీవీ రెడ్డి కూడా గత ప్రభుత్వంలో వచ్చిన ఆరోపణలుపై ఫోకస్ పెంచారు. ఆ సమయంలో ఉద్యోగాల స్కాం బయటకు వచ్చింది. దీంతో అడ్డుగోలుగా నియమితులైన వారికి ఉద్వాసన పలకాలని ప్రభుత్వం భావించింది. అయితే రకరకాల పరిపాలన కారణాలు, అడ్డంకుల వల్ల పది నెలలు ఆలస్యమైంది. ఫైబర్ నెట్ పై విచారణ జరిపిన అధికారుల సూచనలతో మొత్తం 248 మందిపై ఒకే సారి వేటు వేసింది. అయితే వీరిలో సాంకేతికంగా కీలకమైన ఉద్యోగులు కూడా ఉండటంతో ప్రభుత్వ నిర్ణయం టెన్షన్ కు దారితీస్తోంది. తొలగింపునకు గురైన సాంకేతిక సిబ్బందిలో ఎక్కువ మంది వైజాగ్ నెట్ వర్కు ఆపరేషన్ సెంటర్ (నాక్) లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిని తీసేయడంతో నాక్ దాదాపు మూతపడే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. నాక్ లో సాంకేతిక సమస్య తలెత్తితే పరిష్కరించేవారే లేకుండా పోయారని అంటున్నారు.

ఉద్యోగులను ఒకేసారి తొలగించడంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ కార్యాలయం పూర్తిగా సెక్యూరిటీ సిబ్బందికే పరిమితమైందని అంటున్నారు. సాంకేతిక సిబ్బందిని కొత్తగా నియమించకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ఫైబర్ నెట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ చేయాలనే డిమాండు వినిపిస్తోంది. యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పనతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు అందించే వీలు ఉంటుందని అంటున్నారు. గత ప్రభుత్వంలో నిర్వహణ లోపాల వల్ల ఫైబర్ నెట్ దాదాపు రూ.2,171 కోట్లు అప్పులు పాలైంది. దాదాపు దివాళా అంచున చేరుకున్న ఫైబర్ నెట్ లో రూ.500 కోట్ల అక్రమాలు కూడా చోటుచేసుకున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఫైబర్ నెట్ కార్పొరేషనును సీఎం చంద్రబాబు సంస్కరించాలని సూచనలు వస్తున్నాయి.

Tags:    

Similar News