కాన్వాయ్ ఆపి మరీ బడ్డీ కొట్టుకెళ్లిన బాబు.. ఏం చేశాడంటే?
ఆ దుకాణంలోని మహిళ, తన భర్త పక్షవాతంతో మంచాన పడటంతో కుటుంబ భారం తనపై పడిందని, దుకాణం సరిగా నడవడం లేదని ముఖ్యమంత్రికి విన్నవించుకుంది.;

బాబు గారు ఆశ్చర్యపరిచారు. కాన్వాయ్ ఆపి మరీ ఒక సాధారణ బడ్డీ కొట్టుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లాలోని పొన్నెకల్లు గ్రామం మీదుగా వెళుతుండగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి తన కాన్వాయ్‌ను హఠాత్తుగా ఆపి, రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టును సందర్శించారు. వేడి ఎండలో ఆయన వాహనం దిగి దుకాణంలోకి వెళ్లడంతో భద్రతా సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఆ దుకాణంలోని మహిళ, తన భర్త పక్షవాతంతో మంచాన పడటంతో కుటుంబ భారం తనపై పడిందని, దుకాణం సరిగా నడవడం లేదని ముఖ్యమంత్రికి విన్నవించుకుంది. తనకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఆమె చెప్పడంతో, ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం అందుతోందా అని చంద్రబాబు ఆరా తీశారు. ఆమెకు ఎలాంటి సహాయం అందడం లేదని తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి స్పందించారు. అక్కడికక్కడే గుంటూరు జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి, ఆ మహిళ నడుపుతున్న చిన్న దుకాణాన్ని శాశ్వత దుకాణంగా మార్చాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఆ కుటుంబ పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసి, వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని, దంపతులకు పింఛన్లు మంజూరు చేయాలని కూడా కలెక్టర్‌ను ఆదేశించారు.
అంతటితో ఆగకుండా చంద్రబాబు నాయుడు మరో గ్రామంలోని ఒక మెకానిక్ షాపును కూడా సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న దళిత వ్యక్తి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ వ్యక్తికి గ్యారేజీ మరియు ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని తక్షణమే స్పందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రజలు అభినందిస్తున్నారు. నిరుపేదల పట్ల ఆయన చూపిన మానవత్వం, తక్షణ సహాయం అందించాలనే తపన పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి.