మరీ ఇంత పెద్ద మాట అవసరమా సీఎం రేవంత్?
పార్లమెంటులో బీఆర్ఎస్ కు గుండుసున్నా వస్తుందని చెప్పాను. వచ్చేలా చేశాను. వరంగల్ గడ్డ మీద నుంచి కేసీఆర్ కు చెబుతున్నా.
అధికారం చేతికి వస్తే చాలు.. మాటలు కోటలు దాటతాయి. ఈ తీరుకు ఎవరు మినహాయింపు కాదు. ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే వచ్చాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి. తాజాగా వరంగల్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శరక్తి విజయోత్సవ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వను. ఆయనను ఓడిస్తానని చెప్పాను. ఓడించాను. పార్లమెంటులో బీఆర్ఎస్ కు గుండుసున్నా వస్తుందని చెప్పాను. వచ్చేలా చేశాను. వరంగల్ గడ్డ మీద నుంచి కేసీఆర్ కు చెబుతున్నా. మీ పార్టీని మళ్లీ మొలవనివ్వను. మా కార్యకర్తల పౌరుషమా? మీ కుట్రలు.. కుతంత్రాలా? తేల్చుకుందాం' అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. వరంగల్ బహిరంగ సభలోని తన ప్రసంగంలో తన మాటల తూటాల్ని గులాబీ బాస్ కేసీఆర్ మీదనే కాదు.. కేంద్ర మంత్రి.. బీజేపీ నేత కిషన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ మీదా ఎక్కు పెట్టటం గమనార్హం. ఫాంహౌస్ లో పడుకుంటే.. మీ సంగతి నాకు తెలియదని అనుకుంటున్నారేమో. మీ ఉపాయం.. ఉబలాటం.. అన్నీ తెలుసు. అన్నింటికీ నా దగ్గర మందు సిద్దంగా ఉంది. మళ్లీ చెబుతున్నా. అసెంబ్లీకి రండి. మాట్లాడదాం. తేలుద్దాం. ఇన్ని రోజులూ కిషన్ రెడ్డిపై ఉన్న ఆ గౌరవం పోయింది. సబర్మతీని గుజరాత్ లో మోడీ డెవలప్ చేస్తే ఆయన చప్పట్లు కొట్టారు. మూసీని డెవలప్ చేస్తామంటే అడ్డం పడుతున్నారు'' అంటూ మండిపడ్డారు.
మోడీకి కిషన్ రెడ్డి గులామునేనని కిషన్ రెడ్డి అంటున్నారని.. అదే సమయంలో తనను సోనియమ్మకు గులామువా? అని ఆయన తనను ప్రశ్నిస్తున్న విషయాన్ని ప్రస్తావించిన సీఎం రేవంత్.. ''1200 మంది బిడ్డల ఆత్మబలిదానాలు జరిగినా, 60 ఏళ్ల ఆకాంక్ష అయినా తెలంగాణ రాకపోవటంతో.. కన్నతల్లిగా.. గొప్ప మనసుతో ఏపీలో పార్టీ దెబ్బ తింటుందని తెలిసినా.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఆమె కాళ్లు కడిగి.. నెత్తి మీద చల్లుకోవటానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం.
ఇది ఆత్మగౌరవంగా భావిస్తున్నాం. ఇప్పటికైనా మీ పాపాలు కడుక్కోవటానికి రండి. సోనియమ్మ కాళ్లు కడిగి.. మనిద్దరం నెత్తి మీద చల్లుకుందాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పార్లమెంటులో కించపరిచిన మోడీకి గులాములైతే.. తెలంగాణలో ఉండటానికి మీకు అర్హత లేదు. గుజరాత్ కే వెళ్లండి. మీకు ఉద్యోగం ఇచ్చింది మోడీ కాదు. సికింద్రాబాద్ ప్రజలు. వారికి కృతజ్ఞతగా ఉండండి. ఈ రోజు కాళోజీ ఉండి ఉంటే.. ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేని కిషన్ రెడ్డి.. కేసీఆర్ లను పొలిమేరలు దాటే వరకూ తరమాలని చెప్పి ఉండేవారు' అంటూ విరుచుకుపడ్డారు.
తన ప్రసంగంలో భాగంగా అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత కేసీఆర్ తీరుపై విమర్శనాస్త్రాల్ని సంధించారు. వరుసగా మూడుసార్లు ప్రతిపక్షంలోనే ఉండి.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత పాత్ర ఎలా నిర్వహించాలో రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలన్న రేవంత్ రెడ్డి.. ''నిజంగానే ప్రజలు కష్టాల్లో ఉంటే.. మీరు ఫాంహౌస్ లో ఏం చేస్తున్నారు? మీరు ప్రజల్లో రాకపోగా.. వారిద్దర్నీ పంపుతున్నారు. వారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే.. ఆటో డ్రైవర్లతో ధర్నా చేయిస్తారా? మీ కొడుకు ఖాకీ అంగీ వేసుకుంటే.. ఆటో రాముడవుతారా?'' అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
వరి వేసుకుంటే ఉరే నని కేసీఆర్ ఒకప్పుడు అన్నారని.. ఈ రోజు తెలంగాణ 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించినట్లుగా పేర్కొన్నారు. 'స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనూ.. తెలంగాణలోనూ ఇంత పంట ఎప్పుడూ రాలేదు. మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్ కూడా అందిస్తున్నాం. ఇవన్నీ కోల్పోయినట్టా? అని కేసీఆర్ ను తాను అగుడుతున్నట్లుగా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్. అందుకే.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని.. అన్నీ చర్చిద్దామన్నారు.
ప్రతిపక్షాలు కుట్రలు.. కుతంత్రాలకు పాల్పడి.. అక్రమ సంపాదనతో కిరాయి మనుషులని తీసుకొచ్చినా తాము వాటిని ఛేదిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్.. 'అభివృద్ధిని అడ్డుకునేందుకు చూస్తే.. జైలు ఊచలు లెక్క బెట్టాల్సి వస్తుంది' అంటూ ఆసక్తికర హెచ్చరిక చేశారు. 2014 నుంచి 2019 వరకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరన్న సీఎం రేవంత్.. తమ మంత్రివర్గంలో కొండా సురేఖ.. సీతక్కలకు ప్రముఖ స్థానాన్ని ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. 'ఇది ఆడబిడ్డల రాజ్యమని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఇప్పుడు శచ్చింది. సౌర విద్యుత్ ప్లాంట్లను ఆడబిడ్డలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది'' అని ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు. తమ ప్రభుత్వం కొలువు తీరిన పది నెలల్లోనే విప్లవాత్మక పథకాల్ని అమలు చేస్తున్నట్లుగా చెప్పిన ఆయన.. 'పది నెలల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6,333 మంది ఉద్యోగాలు సాధించారు'' అని పేర్కొనటం గమనార్హం.