మంత్రుల పై సీఎం గారి కి ఎందుకంత కోపం ?
దీనికి కారణం ఏమిటంటే తాము ఇన్చార్జీలుగా ఉన్న జిల్లాలతో పాటు తమ సొంత జిల్లాల్లో కూడా మంత్రులు పెద్దగా పర్యటించటం లేదట.
తెలంగాణా మంత్రులపై కేసీఆర్ మండిపోతున్నారట. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు మంత్రులను పిలిపించుకుని ఫుల్లుగా క్లాసులు పీకినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే తాము ఇన్చార్జీలుగా ఉన్న జిల్లాలతో పాటు తమ సొంత జిల్లాల్లో కూడా మంత్రులు పెద్దగా పర్యటించటం లేదట. ఎందుకంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది మంత్రులు కేవలం తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైపోయారట. జిల్లాలు, ఇన్చార్జి జిల్లాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించకుండా, పార్టీని బలోపేతం చేయకుండా కేవలం తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అవటం ఏమిటనేది కేసీఆర్ ప్రశ్న.
నిజానికి ఇందులో మంత్రుల తప్పేమీలేదనే చెప్పాలి. ఎలాగంటే ఇంతకాలం మంత్రుల్లో చాలామందికి పెద్దగా అధికారాలు ఏమీ లేవు. కేవలం ముగ్గురు, నలుగురు మంత్రులు మాత్రమే అపరిమితమైన అధికారాలను చెలాయిస్తున్నారు.
మిగిలిన మంత్రులంతా కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగిలిపోయారు. జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమపథకాలపై సమీక్షలు చేయటం వరకు ఓకేనే కానీ అంతకుమించిన అధికారాలు మంత్రులకు ఏమీలేవు.
మంత్రులు ఏ విషయంమీద ఆదేశాలు ఇచ్చినా కలెక్టర్లు, ఎస్పీలు వెంటనే సీఎంవో, కేటీయార్ లేదా కవితతో మాట్లాడాల్సిందే. వీళ్ళ ఆమోదం లేకపోతే ఉన్నతాధికారులు ఏవీ అమలు చేసేవారు కాదని పార్టీలోనే విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అలాంటిది ఎన్నికలు కొద్ది నెలలుండగా మంత్రులంతా పర్యటనలు చేయాలని, సమీక్షలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కేసీయార్ అంటే ఉపయోగం ఏమిటి ? మొన్నటివరకు మంత్రులను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది కేసీయారే ఇపుడు సరిగా పనిచేయడం లేదని మండుతున్నదీ కేసీయారే.
మొత్తం అధికారాలను తన దగ్గరే ఉంచుకున్నపుడు కేసీయార్ కు ఈ సమస్య తెలీలేదా ? ఒకపుడు కేసీయార్ కూడా మంత్రిగా పనిచేసిన వ్యక్తే కదాని పార్టీలో చర్చ మొదలైంది. మంత్రులు ఇంత ఉదాసీనంగా ఉంటు కేవలం తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైతే ఎలాగంటు కేసీయార్ నిలదీస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపిస్తారని అడుగుతుంటే మంత్రులు ఏమీ సమాధానాలు చెప్పలేకపోతున్నారు. పార్టీలో, ప్రభుత్వంలోనే ఇన్ని సమస్యలు పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో 100 సీట్లలో గెలుపు గ్యారెంటీ అని కేసీయార్ చేసే ప్రకటనలను ఎవరైనా నమ్ముతారా ?