టోల్‌ ఛార్జీలను తప్పించుకోవాలని సీఎం కాన్వాయ్‌ లోకి... మేటర్ సీరియస్!

అవును... వాస్తవానికి ముఖ్యమంత్రి కాన్వాయ్ అంటే ఎలా వెళ్తుందనేది తెలిసిన విషయమే.

Update: 2024-05-09 09:41 GMT

కొంతమంది ఫేమాస్ అవ్వాలని చేస్తుంటారో.. లేక, వ్యవస్థలకంటే తాము తెలివైన వారమనే అజ్ఞానంతో చేస్తారో.. అదీగాక, తాము చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తామనే అర్ధజ్ఞానంతో ఆలోచిస్తారో తెలియదు కానీ.. ఎవరూ ఊహించని కొన్ని పనులకు పాల్పడుతుంటారు. ఆనాక శ్రీకృష్ణజన్మ స్థలంలో రెస్ట్ తీసుకుంటుంటారు! తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది.

అవును... వాస్తవానికి ముఖ్యమంత్రి కాన్వాయ్ అంటే ఎలా వెళ్తుందనేది తెలిసిన విషయమే. ఆయన ప్రయాణిస్తున్న మార్గమంతా గ్రీన్ జోన్ గా చేసి క్లియర్ చేస్తారు ట్రాఫిక్ పోలీసులు! ఇక టోల్ చార్జీలు గట్రా ఏమీ ఉండవు కూడా! ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్ శిండే కాన్వాయ్‌ వెళ్తుంది. ఈ సమయంలో ఒక వ్యక్తి తన కారుతో ఆ కాన్వాయ్ లో చేరి, దాన్ని అనుసరించాడు.

దీంతో... తమ కాన్వాయ్ లోకి కొత్తగా మరో కారు వచ్చినట్లు గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అనంతరం కారును ఆపి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో ప్రశ్నించారు పోలీసులు. ఇందులో భాగంగా... కాన్వాయ్ లోకి ఎందుకు ప్రవేశించావంటే అతడు చెప్పిన రీజన్ పోలీసులకు షాకిచ్చిందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ముంబయిలోని బాంద్రా వర్లీ సీలింక్ వద్ద ఏక్‌ నాథ్ శిండే కాన్వాయ్‌ ను తన కారులో ఫాలో అయ్యాడు సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునే శుభమ్‌ కుమార్ అనే వ్యక్తి. ఆ సమయంలో అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు వారిస్తున్నా వినకుండా టోల్‌ ప్లాజా వద్ద వీఐపీ లేన్‌ లోకి తన కారు కూడా పోనిచ్చాడు. దాంతో అప్రమత్తమైన అధికారులు అతడిని అరెస్టు చేశారు.

దీంతో... అతడిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు.. సీఎం కాన్వాయ్ లోకి ఎందుకు వెళ్లావని ప్రశ్నిస్తే... టోల్‌ ఛార్జ్‌ తప్పించుకోవడానికని అతడు చెప్పాడు. దీంతో... అతడిపై ర్యాష్‌ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద కేసు నమోదుచేశారు. అయితే.. సోషల్ మీడియలో వీడియో పోస్ట్ చేయడానికే ఈ సాహసానికి ఒడి గట్టి ఉంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Tags:    

Similar News